హింస, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై రాజకీయ నిషేధానికి బిల్లు : మమత

ABN , First Publish Date - 2021-04-13T01:09:56+05:30 IST

కాల్పులు, షూటింగ్‌లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని రాజకీయాల నుంచి..

హింస, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై రాజకీయ నిషేధానికి బిల్లు : మమత

నార్త్ 24 పరగణాలు: కాల్పులు, షూటింగ్‌లపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిని రాజకీయాల నుంచి నిషేధించే బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో తాను ప్రవేశపెడతానని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. డుమ్ డుమ్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. 'బీజేపీ నిస్సగ్గుగా వ్యవహరిస్తోంది. నలుగురు వ్యక్తులను చంపిన తర్వాత కూడా మరో నాలుగు రౌండ్లు కాల్పులు జరపి ఉండాల్సిందంటూ వాళ్లు మాట్లాడుతున్నారు. ఒక రాజకీయ పార్టీ ఇలాగేనా మాట్లేడేది? మనం రాజకీయాల్లో ఉన్నాం. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఎలాంటి దేశంలో మనం జీవిస్తున్నాం. వీళ్లని బెంగాల్‌ ప్రజలని చెప్పుడానికి కూడా సిగ్గుగా ఉంది. వాళ్లని అరెస్టు చేసి, రాజకీయాల నుంచి నిషేధించాలి' అని మమత నిప్పులు చెరిగారు.


'అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టమని సౌగత్ దా (టీఎంసీ నేత సౌగత్ రాయ్)ని అడుగుతాను. హింసాత్మక వ్యాఖ్యలు చేసే వాళ్లను, 'గోలీ మార్‌దో' నినాదాలిచ్చే వారిని రాజకీయాల్లోంచి నిషేధించాలి' అని మమత అన్నారు. బీజేపీ మాటలు వినవద్దని, నిషాక్షికంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌ను మమత కోరారు.


మోదీపై నిప్పులు...

ప్రధాని మోదీపై మమత తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. 'నేను నిజంగానే విచారపడుతున్నాను. సిగ్గుపడుతున్నాను. మాట్లాడేటప్పుడు హద్దులు చూసుకోకుండా మాట్లాడే ఇలాంటి ప్రధానిని నేనెప్పుడూ చూడలేదు. అన్ని మతాల వారి గురించి నేను పనిచేశాను. నేను చేయనిదేమిటి? ఒక్కటి మాత్రమే ఇప్పుడు మిగిలింది. బీజేపీ హటావో...దేశ్ బచావో' అని మమత పిలుపునిచ్చారు.


ఒక్కోచోట ఒక్కో కార్డ్...

'ట్రంప్ కార్డ్‌' వినిపించేందుకు మోదీ అమెరికా వెళ్లారని, ఆ తర్వాత బెంగాల్ కార్డ్ జపంతో బంగ్లాదేశ్ వెళ్లారని అన్నారు. లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ఏజెంట్లని మమత విమర్శించారు. దీనికి ముందు, మమతా బెనర్జీ ఎస్‌సీలు, ఎస్‌టీలు, ఓబీసీలపై బహిరంగ యుద్ధం ప్రకటించారని ఎన్నికల ప్రచారసభలో ప్రధాని మోదీ విమర్శించారు. ఆ కొద్దిసేపటికే మమత ఆయనపై ప్రతివిమర్శలు గుప్పించారు.

Updated Date - 2021-04-13T01:09:56+05:30 IST