ఎనిమిది విడతల్లోనా? ఈసీ నిర్ణయంపై మమత గరంగరం

ABN , First Publish Date - 2021-02-27T00:36:11+05:30 IST

ఎనిమిది విడతలుగా బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ఎనిమిది విడతల్లోనా? ఈసీ నిర్ణయంపై మమత గరంగరం

కోల్‌కతా : ఎనిమిది విడతలుగా బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసోంలో మూడు విడతలుగా, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాము ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈ నిర్ణయమా? వారి ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? బెంగాల్ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చే ముందే అసోం, తమిళనాడు ప్రచారాన్ని ముగించుకోవచ్చన్న భావనా? అలా కుదరదు. ఈ ఐడియా బీజేపీకి కలిసిరాదు. అలా కానివ్వం.’’ అంటూ మమత ఫైర్ అయ్యారు.


అంతేకాకుండా ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపైనా ఆమె మండిపడ్డారు. రెండు దశలుగా జిల్లాల్లో జరపాలని నిర్ణయించారు. సౌత్ 24 పరగణా జిల్లాలో తాము చాలా బలంగా ఉన్నాం. అక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 లాగా మాకు నేర్పిస్తున్నారు.’’ అని సీఎం మండిపడ్డారు. బీజేపీ వారు మతాల ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారని, ఇప్పుడే ఆట ప్రారంభమైందని, ఆట ఆడి, ఆటలో గెలిచి చూపిస్తామని మమత ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-27T00:36:11+05:30 IST