న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని కోరిన కపిల్ సిబల్‌కు టీఎంసీ ఓ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఈ షరతుకు అంగీకరించడం ఇష్టం లేకపోవడంతో ఆయన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ను సంప్రదించినట్లు సమాచారం. అఖిలేశ్ ఎటువంటి షరతులు విధించకుండా మద్దతిచ్చేందుకు ముందుకు రావడంతో బుధవారం కపిల్ లక్నోలో నామినేషన్ దాఖలు చేశారు.
కపిల్ సిబల్ (Kapil Sibal) రాజ్యసభ (Rajya Sabha) సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేసిన తర్వాత బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్‌కు మే 16న రాజీనామా చేశానన్నారు. తాను పార్లమెంటులో స్వతంత్ర గళం వినిపిస్తాన్నారు. బీజేపీ (BJP)కి వ్యతిరేకంగా పోరాడుతామన్నారు.
అయితే కపిల్ సిబల్ ముందుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని టీఎంసీ (TMC) మద్దతు కోరినట్లు తెలుస్తోంది. టీఎంసీలో చేరాలని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banarjee) కోరినట్లు సమాచారం. తన పేరు దగ్గర తృణమూల్ కాంగ్రెస్ అని ఉండటం కపిల్ సిబల్‌కు ఇష్టం లేదని, అందుకే ఆయన లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను సంప్రదించారని సమాచారం. అఖిలేశ్ ఆయనకు మద్దతిచ్చేందుకు ముందుకు రావడం మాత్రమే కాకుండా, తన కోసం తన పార్టీలో చేరవలసిన అవసరం లేదని చెప్పారని తెలుస్తోంది.
వాస్తవానికి టీఎంసీతో కొద్ది నెలల నుంచి కపిల్ సిబల్ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ టిక్కెట్‌పై రాజ్యసభ ఎంపీని కావాలని తాను కోరుకోవడం లేదని ఓ టీఎంసీ ఎంపీతో ఆయన చెప్పినట్లు పేర్కొన్నాయి. తనకు టీఎంసీ మద్దతిస్తుందా? అని అడిగినట్లు తెలిపాయి. తీరా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసే సమయం వచ్చేసరికి తమ పార్టీలో చేరితేనే మద్దతిస్తామని మమత, అభిషేక్ స్పష్టం చేసినట్లు తెలిపాయి. ఓ న్యాయవాదిగా కపిల్ సిబల్, టీఎంసీ మధ్య సంబంధాలు సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, టీఎంసీ తరపున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు.
ఇవి కూడా చదవండి