న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రేపు (బుధవారం) ప్రతిపక్ష నేతలతో సమావేశం కానున్నారు. అయితే, అంతకుముందే నేడు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను మమత ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మమతతో సమావేశమైన ఫొటోలను తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసిన శరద్ పవార్.. వివిధ అంశాలపై చర్చించినట్టు పేర్కొన్నారు.
బుధవారం నాటి సమావేశం నేపథ్యంలో నేడు దేశ రాజధానికి చేరుకున్న మమత తన నివాసానికి వెళ్లడానికి ముందే శరద్ పవార్‌ను ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. బుధవారం నాటి సమావేశానికి మొత్తం 22 పార్టీలను ఆమె ఆహ్వానించారు. కాంగ్రెస్ తరపున మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా హాజరవుతారు. కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు వినిపిస్తుండడంపై స్పందించిన శరద్ పవార్.. వాటిని కొట్టిపడేశారు. అవి ఊహాగానాలు మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘నేను రేసులో లేను. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిని నేను కాను’’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి