Abn logo
Jan 24 2021 @ 03:17AM

మమత ఎదుట ‘జై శ్రీరామ్‌’.. ‘పిలిచి అవమానిస్తారా?’ అంటూ ఆగ్రహం

  • నేతాజీ జయంతి కార్యక్రమంలో నినాదాలు
  • ప్రధాని మోదీ, గవర్నర్‌ ధన్‌కర్‌ సమక్షంలోనే
  • పిలిచి అవమానించారన్న సీఎం మమత 

న్యూఢిల్లీ/కోల్‌కతా, జనవరి 23: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి శనివారం చేదు అనుభవం ఎదురైంది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని కోల్‌కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగాన్ని మొదలు పెడుతుండగా.. కొందరు సభికులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ వేదికపై ఉండగా, వారి సమక్షంలోనే ఈ నినాదాలు చేయడంతో మమత తీవ్రంగా మండిపడ్డారు. ‘ఇది రాజకీయ కార్యక్రమం కాదు. నన్ను ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి అవమానిస్తారా!’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడబోనని ప్రకటించి కూర్చుండిపోయారు. అయితే నినాదాలు చేస్తున్న సమయంలో ప్రధాని, గవర్నర్‌ నిశ్శబ్ధంగా ఉండిపోయారు. కాగా, త్వరలో బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండడం, రాష్ట్రంలో తృణమూల్‌, బీజేపీ మధ్య ఉద్రిక్తకరమైన వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో మోదీ, మమత ఒకే వేదికను పంచుకోవడం, ఈ ఘటన జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారతదేశం ఎలా ఉండాలని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కలలు కన్నారో ప్రస్తుతం అలా రూపుదిద్దుకుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ఇకపై ప్రతి ఏటా నేతాజీ జయంతి రోజు (జనవరి 23)ను పరాక్రమ్‌ దివ్‌సగా జరుపుకోనున్నట్లు ప్రకటించారు. నేతాజీ పేరిట స్టాంపును, నాణేన్ని ప్రధాని ఆవిష్కరించారు.  


తరగని స్ఫూర్తి: రాష్ట్రపతి

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నేతాజీ చిత్రపటాన్ని రాష్ట్రపతి కోవింద్‌ ఆవిష్కరించారు. నేతాజీ దేశభక్తి, త్యాగం ఎప్పటికీ మనందరిలో స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటాయని ట్విటర్‌లో రాష్ట్రపతి పేర్కొన్నారు. కాగా, నేతాజీ ధైర్యసాహసాలు భారత స్వాతంత్ర సంగ్రామానికి సరికొత్త బలాన్నిచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కొనియాడారు. మరోవైపు కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లోనూ నేతాజీ చిత్రపటాన్ని బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఆవిష్కరించారు.  


అభినందనీయం: వెంకయ్య 

హైదరాబాద్‌: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పేదరికం, నిరక్షరాస్యత, సామాజిక దురాచారాలు లేని సమాజ నిర్మాణం దిశగా యువత కృషి చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. సుభాష్‌ చద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో శిక్షణ పొందుతున్న అధికారులను ఉద్దేశించి వెంకయ్య నాయుడు ప్రసంగించారు. దేశ ప్రజల్లో స్ఫూర్తి రగిలించే విధంగా నేతాజీ జయంతిని పరాక్రమ్‌ దివ్‌సగా జరుపుకోవాలని  కేంద్రం నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌, అడిషనల్‌ జనరల్‌ బెన్‌హర్‌దత్‌ ఎక్కా, ఇతరు అధికారులు పాల్గొన్నారు.Advertisement
Advertisement
Advertisement