మమత అహంకారి... ఏ సమావేశాలకూ హాజరు కారు : మోదీ

ABN , First Publish Date - 2021-04-17T19:57:15+05:30 IST

అభివృద్ధి పేరుతో పదేళ్లుగా ముఖ్యమంత్రి మమతా బెంగాలీలను మోసం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు

మమత అహంకారి... ఏ సమావేశాలకూ హాజరు కారు : మోదీ

కోల్‌కతా : అభివృద్ధి పేరుతో పదేళ్లుగా ముఖ్యమంత్రి మమతా బెంగాలీలను మోసం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. అభివృద్ధికి అడ్డుగా ఓ గోడ లాగా నిలిచారని మోదీ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా హెల్త్ చెకప్ స్కీంను ప్రతిపాదిస్తే అది అమలు కాకుండా అడ్డుగా ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ శనివారం బెంగాల్‌లోని అసన్‌సోల్‌ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శరణార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను రూపొందిస్తే వాటిని కూడా మమత తోసిపుచ్చారని మోదీ పేర్కొన్నారు. చివరికి ‘కూచ్‌బిహార్’ కాల్పుల ఘటనను కూడా దీదీ రాజకీయం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కూచ్ బిహార్ బాధితులతో ఓ యాత్ర తీయాలని మమత అన్న ఆడియో టేపులు కూడా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సీఎం మమతకు అహంకారం బాగా పెరిగిపోయిందని, ఎదుటి వారు ఎంతవారైనా వారందరూ ఆమెకు చిన్నగా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.


కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు అనేక విషయాలపై చర్చించడానికి మమతను ఆహ్వానించిందని, కానీ ప్రతిసారీ ఏదో ఒక కారణం చెబుతూ ఆ భేటీలకు ఆమె డుమ్మా కొట్టారని మోదీ ఎద్దేవా చేశారు. కరోనా విషయంలో కేవలం రెండే రెండు భేటీలకు మమత హాజరయ్యారని, మిగతా ముఖ్యమంత్రులందరూ భేటీలకు హాజరయ్యారని తెలిపారు. నీతి ఆయోగ్‌ సమావేశాలకు కూడా దీదీ డుమ్మా కొట్టారని ఆయన గుర్తు చేశారు. నాలుగు దశల ఎన్నికల్లో టీఎంసీ పరాభవాన్ని ఎదురవుతుందని, ఇక తదుపరి పోలింగ్ దశల్లోనూ ప్రజలందరూ బీజేపీకి ఓటు వేయాలని మోదీ పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-04-17T19:57:15+05:30 IST