Modi Government : బీజేపీది తుగ్లక్ పాలన : మమత బెనర్జీ

ABN , First Publish Date - 2022-05-20T01:14:34+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలో తుగ్లక్ పాలన జరుగుతోందని

Modi Government : బీజేపీది తుగ్లక్ పాలన : మమత బెనర్జీ

కోల్‌కతా : భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలో తుగ్లక్ పాలన జరుగుతోందని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ (Mamata Banerjee) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఝర్‌గ్రామ్‌లో టీఎంసీ కార్యకర్తల సమావేశంలో గురువారం ఆమె మాట్లాడుతూ, శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ రాష్ట్రం పరువు తీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 


ఎస్ఎస్‌సీ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ విద్యా శాఖ మంత్రి పార్థ ఛటర్జీపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తు జరుపుతోంది. ఆవుల అక్రమ రవాణా కేసులో అనుబ్రత మండల్ స్వయంగా సీబీఐ (CBI) సమక్షంలో హాజరయ్యారు. టీఎంసీ (TMC) నేతలు వరుసగా సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటుండటంతో మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో మమత మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అవమానించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఈ విధంగా టీఎంసీని అణగదొక్కడం సాధ్యం కాదని, పార్టీ కార్యకర్తలు మరింత శ్రమించి, కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేడు దేశంలో తుగ్లక్ పాలన చేస్తోందన్నారు. కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల సహాయంతో ఈ తుగ్లక్ పాలన చేస్తోందని మండిపడ్డారు. నేడు ఎవరికీ జీవించే హక్కు లేకుండాపోయిందన్నారు. ఎవరికీ స్వాతంత్ర్యం లేదని, పౌర హక్కులు లేవని అన్నారు. అన్ని హక్కులను పోగొట్టారన్నారు. ఏదైనా ముఖ్యమైన సంస్థను సందర్శించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. కేవలం బీజేపీవారిని మాత్రమే అనుమతిస్తున్నారన్నారు. 


అవినీతికి పాల్పడరాదని, నిష్కళంకులుగా ఉండాలని టీఎంసీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏదైనా పథకానికి నిధులు అందకపోతే నేరుగా తనకే ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ప్రజలను కోరారు. 


Updated Date - 2022-05-20T01:14:34+05:30 IST