పోషకాహార లేమి శాపం

ABN , First Publish Date - 2022-08-11T05:00:19+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పిల్లల్లో పోషకాహార లోపం ప్రధాన సమస్యగా మారింది. సరైన పౌష్ఠికాహారం అందకపోవడం వల్ల వారిలో ఎదుగుదల రోజురోజుకూ క్షీణిస్తోంది.

పోషకాహార లేమి శాపం

పిల్లల్లో లోపించిన ఎదుగుదల

ఎత్తు పెరగని చైల్డ్‌ ఉన్న జిల్లాల్లో గద్వాలకు దేశంలో నాలుగో స్థానం

ఉమ్మడి పాలమూరులో ఎత్తు, బరువు వయసుకు తగ్గట్లు లేని పిల్లలు

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే -5 నివేదికలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

8 పోషన్‌ అభియాన్‌ కింద ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నా మారని స్థితి


ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పిల్లల్లో పోషకాహార లోపం ప్రధాన సమస్యగా మారింది. సరైన పౌష్ఠికాహారం అందకపోవడం వల్ల వారిలో ఎదుగుదల రోజురోజుకూ క్షీణిస్తోంది. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు, ఇతర పథకాల ద్వారా పిల్లల పోషణకు బలవర్ధకమైన ఆహారం అందిస్తున్నప్పటికీ, పరిస్థితిలో మార్పు రావడం లేదు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 నివేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వం జిల్లాల్లో పోషకాహార లోపం ఏ స్థాయిలో ఉంది, దాని పర్యవసనాలు ఎలా ఉండబోతాయనే విషయాలను వెల్లడించింది. అందులో ప్రధానంగా ఎత్తు తక్కువగా ఉన్న జిల్లాలను తీసుకుంటే దేశంలో జోగుళాంబ గద్వాల జిల్లా నాలుగో స్థానంలో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

- ఆంధ్రజ్యోతి, గద్వాల


పోషకాహార లోపంతో ఉమ్మడి జిల్లా వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా పిల్లల్లో ఎదుగుదల లోపించడంతో పాటు రక్తహీనత సమస్యల బారిన పడుతున్నారు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే-5 నివేదికలో ఈ విషయాలు వెలుగు చూశాయి. పోషకాహార లోపంతో పిల్లల్లో ఎదుగుదల లోపించిన జిల్లాల్లో మొదటి మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌లోని సంబాల్‌ జిల్లా ప్రథమ, మేఘాలయ రాష్ట్రంలోని సౌత్‌వెస్ట్‌ కాశీ జిల్లా ద్వితీయ, గుజరాత్‌లోని పటాన్‌ జిల్లా తృతీయ స్థానాల్లో ఉండగా, 49.7 శాతంతో గద్వాల జిల్లా నాలుగో స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం పోషన్‌ అభియాన్‌ కింద 2018లో రాష్ట్రంలోని 16 జిల్లాల్లో పోషకాహార లోపం వల్ల పిల్లల్లో ఎదుగదల లేదని గుర్తించింది. 25 శాతం కంటే దిగువకు ఆ శాతాన్ని తెచ్చేందుకు కార్యక్రమాలను రూపొందించింది. అయినప్పటికీ గడిచిన నాలుగు సంవత్సరాల్లో పెద్దగా మార్పు రాలేదు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో 30 శాతం కంటే ఎక్కువగానే పోషకాహార లోపంతో పిల్లలు ఎదగడం లేదు. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే -5 ప్రకారం పోషన్‌ అభియాన్‌ కింద గుర్తించిన 16 జిల్లాలకు గాను 15 జిల్లాల్లో పిల్లలు ఎత్తు పెరగడం లేదని కేంద్రం గుర్తించింది. ఎదుగుదల లేకపోవడం వల్ల భవిష్యత్‌లో చాలా ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


ఎత్తు, బరువు తక్కువ..

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే -5 ప్రకారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు జిల్లాల వివరాలను వెల్లడించారు. సర్వే సమయానికి నారాయణపేట జిల్లా మహబూబ్‌నగర్‌లో అంతర్భాగంగా ఉండటంతో వివరాలు ఆ జిల్లా జాబితాలోనే ఉన్నా యి. నాలుగు జిల్లాల నివేదికలను పరిశీలిస్తే అన్నింటిలో ప్రధానంగా ఎత్తు, బరువు తక్కు వగా ఉండటం ఆందో ళన కలిగిస్తోంది. ఇప్పటి కే ఎత్తు పెరగని చిన్నారు లు అత్యధికంగా ఉన్న జిల్లాల్లో దేశంలో జోగుళాంబ గద్వాల జిల్లా నాలుగో స్థానంలో ఉం డగా, మిగతా జిల్లాల పరిస్థితి కూడా నిరాశాజనకంగానే ఉంది. పోషన్‌ అభియాన్‌ ప్రకారం ఎంపిక చేసిన జిల్లాల్లో పోషకాహార లోపం సమస్యను 25 శాతం కంటే తక్కువకు చేర్చడం లక్ష్యంగా పెట్టుకోగా, నాలుగు జిల్లాల్లో ఏ ఒక్క జిల్లా కూడా ఆ పారామీటర్‌కు చేరలేదు. ఎత్తు పెరగని జిల్లాల్లో జోగుళాంబ గద్వాల 49.7 శాతం వద్ద ఉండగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా 35.1, మహబూబ్‌నగర్‌ జిల్లా 42.6, వనపర్తి జిల్లా 40.4 శాతం వద్ద ఉన్నాయి. ఇక బరువు పెరుగుదల కూడా ఉమ్మడి పాలమూరులోని నాలుగు జిల్లాల్లో వయసుకు తగ్గట్లుగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. బరువు తక్కువ ఉన్న జిల్లాల్లో కూడా జోగుళాంబ గద్వాల జిల్లా 41.7 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, నాగర్‌కర్నూల్‌ జిల్లా 30.9 శాతం వద్ద, మహబూబ్‌నగర్‌ 33, వనపర్తి జిల్లా 33.2 శాతం వద్ద ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో ఉమ్మడి పాలమూరులోని నాలుగు జిల్లాలూ కేంద్ర ప్రభుత్వ పారామీటర్లను చేరలేదు. ఇందుకు ప్రధాన కారణం పోషకాహార లోపమే అయినప్పటికీ, ప్రభుత్వం అందిస్తున్న పోషకా హారాన్ని పిల్లలందరికీ అందించకపోవడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు.


రక్తహీనత కూడా ఆందోళనకరం..

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పిల్లల నుంచి బాలికలు, మహిళల వరకు రక్తహీనత సమస్య కూడా అధికంగా ఉంది. ఉన్న జనాభాలో దాదాపు 54 నుంచి 82 శాతం మేర పిల్లలు, బాలికలు, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ప్రధానంగా పిల్లలు, బాలికల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల కేటగిరీని తీసుకుంటే మహబూబ్‌నగర్‌ జిల్లాలో 82.6 శాతం మంది చిన్నారులు రక్తహీనతతో బాధపడు తున్నారు. తర్వాతి స్థానంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో 82.4 శాతం చిన్నారులు, వనపర్తి జిల్లాలో 75.3, నాగర్‌కర్నూలులో 75.1 శాతం మంది చిన్నారులు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇక 15-19 ఏళ్ల బాలికల కేటగిరీలో జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 66.9 శాతం మంది బాలి కలు రక్తహీనతతో బాధప డుతుండగా, ఆ తర్వాతి స్థానాల్లో 65.2 శాతంతో వనపర్తి, 62.1 శాతంతో నాగర్‌కర్నూల్‌, 61.2 శాతం తో మహబూబ్‌నగర్‌ జిల్లా లు ఉన్నాయి. మహిళల విషయానికి వస్తే చిన్నారులు, బాలికలతో పోల్చితే కొంత మెరుగ్గానే ఉన్నా, సగటున 56 శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుల ఆధారంగా సరిగా అందని పోషకాహారం వల్లనే ఈ సమస్య ప్రధానంగా ఉత్పన్నమవుతోంది. తక్కువ వయసులోనే మెన్‌స్ర్టేషన్‌ కావడం, బాల్యవివాహాలు చేయడం రక్తహీ నతకు మరో కారణంగా వైద్యనిపుణులు చెబుతున్నారు. పరిస్థితిలో మార్పు రావాలంటే సరైన పోషకాహారం, తల్లిపాలు నిర్ణీత సమయం వరకు పట్టడం వంటివి ఉపయోగకరంగా ఉంటాయని అంటున్నారు.

Updated Date - 2022-08-11T05:00:19+05:30 IST