కలెక్టర్‌గా మల్లికార్జున్‌

ABN , First Publish Date - 2021-07-24T06:02:32+05:30 IST

జిల్లాలో ఇద్దరు ఐఏఎస్‌లకు శుక్రవారం రాత్రి బదిలీ జరిగింది.

కలెక్టర్‌గా మల్లికార్జున్‌

ఆరోగ్యశ్రీ సీఈఓగా వినయచంద్‌ బదిలీ

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా వెంకటరమణారెడ్డి

కర్నూలు కలెక్టర్‌గా కోటేశ్వరరావు


విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇద్దరు ఐఏఎస్‌లకు శుక్రవారం రాత్రి బదిలీ జరిగింది. జిల్లా కలెక్టర్‌ వినయచంద్‌ను ఆరోగ్యశ్రీ సీఈఓగా బదిలీ చేశారు. అక్కడ సీఈఓ మల్లికార్జున్‌ను కలెక్టర్‌గా నియమించారు. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ పి.కోటేశ్వరరావును పదోన్నతిపై కర్నూలు కలెక్టర్‌గా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న కె.వెంకటరమణారెడ్డిని వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమించారు.


జిల్లా కలెక్టర్‌గా నియమితులైన మల్లికార్జున 2012 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన అనంతరం కొద్దికాలం వైద్య వృత్తి చేపట్టిన తరువాత 2012లో సివిల్స్‌ రాసి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రకాశం జిల్లా కందుకూరు, చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా పనిచేశారు. ఆ  తరువాత తూర్పుగోదావరి జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన  అనంతరం ఆరోగ్యశ్రీ సీఈవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం విశాఖ కలెక్టర్‌గా వస్తున్నారు.


ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం: మల్లికార్జున


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పథకాల అమలుకు ప్రాఽధాన్యం ఇస్తానని డా. ఎ. మల్లికార్జున తెలిపారు. శుక్రవారం రాత్రి ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ సీఈవోగా విధి నిర్వహణలో ఐదారుసార్లు విశాఖ వచ్చానన్నారు. 


విశాఖలో పనిచేయడం అదృష్టం: వినయ్‌చంద్‌


విశాఖపట్నం కలెక్టర్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తానని బదిలీపై వెళుతున్న వినయచంద్‌ అన్నారు. ఉమ్మడి ఏపీలో, విభజన అనంతరం విశాఖపట్నం మణికిరీటం వంటిదన్నారు. అటువంటిచోట కలెక్టర్‌గా పనిచేయడం గొప్ప అనుభూతి అన్నారు. అంతటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇక్కడ పనిచేసిన రెండేళ్ల కాలం సంతృప్తినిచ్చిందన్నారు.  


రెండేళ్లు...నోరు విప్పితే ఒట్టు


వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా కోటేశ్వరరావు రెండేళ్లు పనిచేశారు. సంస్థ తరఫున ఏ ప్రాజెక్టు చేపట్టినా వాటి వివరాలు వెల్లడించడానికి ఇష్టపడేవారు కాదు. ప్రజలకు సంబంధించిన విషయాలే అయినా ఇంటి గుట్టులా అన్నీ రహస్యంగా ఉంచేవారు. ప్రభుత్వం అప్పగించిన వ్యవహారాలను మూడో కంటికి తెలియకుండా చేసుకుంటూ వచ్చారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల రూపకల్పన, నిర్మాణాల విషయంలో కీలకపాత్ర పోషించారు. కాపులుప్పాడలో అతి పెద్ద అతిథిగృహం నిర్మాణం భుజాన వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు, ఎంత వ్యయం? వంటి వివరాలు ఏవీ బయట పెట్టలేదు. ఈ ప్రాంత అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌-2041 తయారైంది ఈయన హయాంలోనే. గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలు, ఆరోపణలు ఈ మాస్టర్‌ప్లాన్‌పై వచ్చాయి. ఒక్కటంటే..ఒక్క దానికి కూడా నోరు విప్పి సమాధానం చెప్పలేదు. అసలు ఆ మాస్టర్‌ప్లాన్‌ లక్ష్యం ఏమిటో చెప్పడానికి కూడా ఆయన మీడియా ముందుకు రాలేదు. ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులు ఇంకా సాగు....తూనే ఉన్నాయి. కైలాసగిరి పునర్నిర్మాణ పనులు, బీచ్‌లో నేవీ మ్యూజియం పనులదీ అదే పరిస్థితి. ఇది ప్రజల సంస్థ అని కాకుండా ప్రభుత్వ పెద్దల సంస్థ అనే అభిప్రాయం కలిగేలా పాలన సాగించారు. 


కొత్త కమిషనర్‌ ..


కె.వెంకటరమణారెడ్డి 2103 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. విజయనగరం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా చేశారు. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. ఇప్పుడు అక్కడి నుంచి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా వస్తున్నారు. రాయలసీమకు చెందిన ఈయన ఏ విషయంలోనైనా చాలా కూల్‌గా ఉంటారని చెబుతారు. 

Updated Date - 2021-07-24T06:02:32+05:30 IST