మళ్ళీ మన ఉక్కు కొరకు..

ABN , First Publish Date - 2021-02-22T05:49:44+05:30 IST

భుగభుగమని పొంగుతోంది బంగాళాఖాతం భగభగభగ మండుతోంది ఉత్తరాంధ్ర హృదయం మావిశాఖమీద పిట్ట...

మళ్ళీ మన ఉక్కు కొరకు..

సాకీ:

భుగభుగమని పొంగుతోంది బంగాళాఖాతం

భగభగభగ మండుతోంది ఉత్తరాంధ్ర హృదయం

మావిశాఖమీద పిట్ట ‘ఈక’ మారె ‘ఈటె’గా

పాడుతోంది నిప్పుగొంతుతో ఉక్కుపాటగా....


పల్లవి:

సలసలసల మరిగే నెత్తుటి వాగుల్లారా

రవరవరవ మండే నిప్పుల పోగుల్లారా

మనవిశాఖ ఉక్కుచిమన ఆంధ్రుల హక్కనండి

కదలిరండి.. కదలిరండి, అందరు ఐక్యం కండి

మళ్ళీ మన ఉక్కుకొరకు కలిసి కదంతొక్కండి!!


చరణం:

ఒకనాడీ ఊరు చిన్న జాలరిపేట

ఉద్యమాలవల్ల అయ్యింది ‘ఉక్కు’కోట

ప్రపంచానికే.. మార్గదర్శకమై నిలిచి

చూపింది మనవిశాఖ చైతన్యపు బాట

మనకోటను, మనతోటను బేరానికి పెట్టినోణ్ణి

వెనకాముందూ చూడక అవతల నెట్టండి

కొనడానికి వచ్చినోణ్ణి తరిమితరిమికొట్టండి!!

                     !!రండి కదలిరండి!!


చరణం:

వేలవేల ఎకరాల మన ఉక్కుభూములు

స్వాహా చేసేస్తారట కలిగిన ఆసాములు

ఉత్తరాంధ్ర అణువణువును ఊర్చుకుపోతారట

కోట్లకోరల నోట్ల పడగలెత్తి పాములు

ఆదానీ అంబానీ..., ఆడెవడో పోస్కో

ఆక్రమించనున్నారట దేశమంత చూస్కో

కార్పొరేట్లు మననేలను కబళించక ముందే

ఉత్తరాంధ్ర వీరుడా వెయ్‌రా దరువేస్కో!!

                   !!రండి కదలిరండి!!


చరణం:

మన ఆస్తుల పైన కన్ను వేసినాడు మోడి

మాటలగారడి వాడు మహామాయ లేడి

ముప్పైయిద్దరి నెత్తుటి ముద్ద ఉక్కుఫ్యాక్టరీ

అమ్ముతుంటె యోధుడా చూపవేమి నీ వాడి

ఊపిరులుప్పెన జేసిన ఉద్యమాల నేల ఇది

కన్నులెర్రజేసి మనం కదలాల్సిన వేళ ఇది

కెరటాల పిడికిళ్ళతో కడలి ఎగిసి పిలుస్తోంది

మన కరాలు శరాలుగా మారాల్సిన కాలమిది!!

                       !!రండి కదలిరండి!!


గంటేడ గౌరునాయుడు

Updated Date - 2021-02-22T05:49:44+05:30 IST