రేపే మల్లన్నసాగర్‌ ప్రారంభం!

ABN , First Publish Date - 2022-02-22T06:59:39+05:30 IST

కొమురవెల్లి మల్లన్నసాగర్‌.. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన

రేపే మల్లన్నసాగర్‌ ప్రారంభం!

  • రిజర్వాయర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
  • 557 మీటర్ల ఎత్తులో నిర్మాణం.. 50 టీఎంసీల నిల్వ
  • 9 జిల్లాల్లోని 11.29 లక్షల ఎకరాలకు సాగునీరు

  


సిద్దిపేట, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి మల్లన్నసాగర్‌.. 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌..కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది! సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దులో దీన్ని నిర్మించారు. బుధవారం సీఎం కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌ను ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ నుంచి సొరంగం ద్వారా తుక్కాపూర్‌ పంపుహౌ్‌సకు చేరిన గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు.


మల్లన్నసాగర్‌ నుంచి కొండపోచమ్మసాగర్‌కు, అక్కడి నుంచి గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు, మరో కాల్వ ద్వారా సంగారెడ్డిలోని మంజీర రిజర్వాయర్‌కు, హల్దీవాగు నుంచి మంజీర నదిలోకి.. అక్కడి నుంచి నిజాంసాగర్‌కు వెళ్లేలా ప్రణాళిక రచించారు. గత వేసవిలో హల్దీవాగు నుంచి నిజాంసాగర్‌కు నీటిని విజయవంతంగా తరలించారు. సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, జనగామ, మేడ్చల్‌, రంగారెడ్డి, యాదాద్రి, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని 11.29 లక్షల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారిక సమాచారం. ఈ రిజర్వాయర్‌కు నిరంతర జలకళ ఉంటే వేసవిలోనూ అన్ని అవసరాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అందుకే మిడ్‌మానేరు నుంచి అన్నాపూర్‌, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల మీదుగా ఎత్తిపోతలతోపాటు అదనపు టీఎంసీ కాలువకు సైతం శ్రీకారం చుట్టారు.వానాకాలంలో రోజుకు 2 టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసి, దీని పరిధిలోని రిజర్వాయర్లకు తరలిస్తారు.


హైదరాబాద్‌కు తాగునీరు

హైదరాబాద్‌ ప్రజల తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం ఎల్లంపల్లి, పలు ఇతర రిజర్వాయర్ల నుంచి నీటిని తరలిస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర రాజధానికి 30టీఎంసీల నీటిని ఈ రిజర్వాయర్‌ నుంచి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం రిజర్వాయర్‌ సమీపంలో మంగోలు వద్ద భారీ నీటిశుద్ధి కేంద్రం, పంపుహౌ్‌సను నిర్మిస్తున్నారు. ఇక్కడ నీటిని శుద్ధిచేసి లకుడారం జంక్షన్‌ వద్ద హైదరాబాద్‌కు వెళ్లే పైపులైన్‌కు అనుసంధానం చేయనున్నారు.


16 టీఎంసీలను పారిశ్రామిక అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. మల్లన్నసాగర్‌ను సముద్రమట్టానికి 557 మీటర్ల ఎత్తులో నిర్మించారు. కాళేశ్వరం వద్ద 100 మీటర్ల ఎత్తు నుంచి 557 మీటర్ల ఎత్తుకు గోదావరి జలాలను తరలించడానికి భారీ పంపుహౌ్‌సలు, మోటార్లను ఏర్పాటు చేశారు. రిజర్వాయర్‌ చుట్టూ 22.60 కి.మీ.ల దూరం భారీ కట్టను నిర్మించారు. 8 గ్రామాలతోపాటు మొత్తం 14 శివారు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 




పునరావాసం.. అద్భుతం


మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు గజ్వేల్‌లో 600 ఎకరాల్లో 2,400 ఇళ్లతో సువిశాలమైన కాలనీని నిర్మించారు. గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో సకల హంగులతో కాలనీ ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి 250 చదరపు గజాల స్థలంలో రూ.5.04 లక్షలతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించారు. కాలనీలో 80, 60, 40 అడుగుల వెడల్పుతో రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటికీ నల్లా, విద్యుత్తు కనెక్షన్లు ఇచ్చారు.


2019లో ప్రారంభమైన కాలనీ నిర్మాణ పనులను రెండేళ్లలో పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చారు. గుడి, బడి, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఫంక్షన్‌హాల్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లు తామే కట్టుకుంటాం అన్నవారికి రూ.5.04 లక్షల చెక్కులు అందించారు. ఉపాధి కోసం రూ.7.50 లక్షల నగదును ప్యాకేజీ రూపంలో అందించారు. 25 ఏళ్లు నిండిన పెళ్లి కాని యువకులకు 250 గజాల స్థలాన్ని, రూ.5 లక్షల నగదును అందించారు. ప్రస్తుతం ఒపెన్‌ ప్లాట్ల కేటాయింపు జరుగుతోంది. 


Updated Date - 2022-02-22T06:59:39+05:30 IST