పరిహారమివ్వకుండా పరిహాసమా

ABN , First Publish Date - 2022-05-24T05:18:27+05:30 IST

మల్లన్నసాగర్‌ అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో బాధితులు ఆందోళనకు దిగారు. తొగుట మండలం ఘనపూర్‌ గ్రామంలో నిర్వాసితులు సోమవారం కాలువ పనులను అడ్డుకున్నారు. పూర్తి పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు.

పరిహారమివ్వకుండా పరిహాసమా
ఘనపూర్‌లో మల్లన్నసాగర్‌ అదనపు టీఎంసీ కాలువ పనులను అడ్డుకుంటున్న నిర్వాసితులు

మల్లన్నసాగర్‌ అదనపు టీఎంసీ కాలువ పనులను అడ్డుకున్న భూ నిర్వాసితులు


తొగుట, మే 23: మల్లన్నసాగర్‌ అదనపు టీఎంసీ కాలువ కోసం భూములిచ్చిన రైతులకు పూర్తి పరిహారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుండటంతో బాధితులు ఆందోళనకు దిగారు. తొగుట మండలం ఘనపూర్‌ గ్రామంలో నిర్వాసితులు సోమవారం కాలువ పనులను అడ్డుకున్నారు. పూర్తి పరిహారం ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు. ఘనపూర్‌ గ్రామంలో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ అదనపు టీఎంసీ కాలువ కోసం 74.36 ఎకరాల భూమిని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. ఎకరాకు రూ. 13 లక్షల చొప్పు చెల్లిస్తామని హామీ ఇచ్చి భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసింది. మొదటి విడతగా రిజిస్ట్రేషన్‌ చేసే సమయంలో రైతులకు ఎకరాకు రూ. 8 లక్షల చొప్పున చెల్లించారు. మిగతా రూ. 5 లక్షలను మూడునెలల్లో చెల్లిస్తామని నమ్మబలికారు. కానీ పది నెలలు దాటినా పరిహారం బకాయి ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో నాలుగు నెలల క్రితం రైతులు పనులను అడ్డుకున్నారు. 15 రోజుల్లోగా పరిహారం అందేలా చూస్తామని కాంట్రాక్టర్‌ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆ తరువాత కూడా పరిహారం అందకపోవడంతో రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. నమ్మి భూమిని రిజిస్ట్రేషన్‌ చేస్తే నట్టేట ముంచుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని ఒత్తిడి చేసిన ప్రజాప్రతినిధులు పరిహారం ఇప్పించమంటే మొఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. పూర్తి పరిహారం ఇచ్చేవరకు పనులు జరగనివ్వబోమని వాహనాలు అడ్డుకున్నారు. పనులు జరుగుతున్న చోటు నుంచి వాహనాలను పంపించి వేశారు.

Updated Date - 2022-05-24T05:18:27+05:30 IST