మలిపోరాటం!

ABN , First Publish Date - 2021-03-18T08:52:58+05:30 IST

కరోనా మహమ్మారి మలి విజృంభణ ప్రమాదాన్ని రాష్ట్రాలు గుర్తెరగడానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశం ఉపకరిస్తుంది...

మలిపోరాటం!

కరోనా మహమ్మారి మలి విజృంభణ ప్రమాదాన్ని రాష్ట్రాలు గుర్తెరగడానికి ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వర్చువల్‌ సమావేశం ఉపకరిస్తుంది. కరోనా విషయంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అప్రమత్తమైనప్పటికీ, ప్రధాని రంగంలోకి దిగడం అన్ని రాష్ట్రాలూ తీవ్రతను గ్రహించడానికీ, సమన్వయానికీ ఉపకరిస్తుంది. ఇరవై నిముషాల భేటీలో ముఖ్యమంత్రులకు నరేంద్రమోదీ కొన్ని సూచనలు చేశారు, ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా మారకూడదని హెచ్చరికా చేశారు. సత్వర నిర్ణయాలతో కరోనా దూకుడుకు ముకుతాడు వేయమని హితోపదేశం చేశారు. 


కొద్దికాలంగా మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు వరుసపెట్టి హెచ్చుతున్న నేపథ్యంలో, ఈ ధోరణి ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాబోదనీ, మరిన్ని రాష్ట్రాల్లో కేసులు బయటపడతాయని అనుకున్నదే. ప్రధాని ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ దృష్టిసారించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. సలహాలు కొత్తవేమీ కాకపోవచ్చును కానీ, సుతిమెత్తని మాటలతో ముంచుకొస్తున్న ముప్పును తెలియచెప్పారు. చాలా రాష్ట్రాలు పరీక్షలు చేయడమే మానేశాయి కనుక ఆయన మరోమారు టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌ క్రమాన్ని గుర్తుచేసి ఉండవచ్చు. గతంలో మాదిరిగా కాక, ఈ మారు అత్యధికుల్లో యాంటీజెన్‌ పరీక్షకు వైరస్‌ దొరకడం లేదన్న అనుమానాలు ఉన్నందున కాబోలు, రాష్ట్రాలు తాము చేసే టెస్టుల్లో 70శాతానికి పైగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలే ఉండేలా చూసుకోమని ప్రధాని సూచించారు. ఏడాది క్రితం పరిస్థితులతో పోల్చితే ఇప్పుడు పరికరాల ఖరీదు కూడా బాగా తగ్గినందున దాని కచ్చితత్వం దృష్ట్యా ఏ మాత్రం వెనుకాడనక్కరలేదు. 


ప్రధాని అన్నట్టుగా టీకా కేంద్రాల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉన్నది. దీర్ఘకాలంలో వైరస్‌కు వ్యతిరేకంగా మందబలాన్ని సముపార్జించిపెట్టేది వాక్సిన్‌ ఒక్కటే కనుక మరిన్ని కేంద్రాలు తెరవడం అవసరమే. వాక్సిన్‌ కొరత ఉన్నదన్న వాదనతో ప్రభుత్వం ఎలాగూ ఏకీభవించడం లేదు కనుక, వాక్సిన్‌ మీద ఇప్పటివరకూ ఉన్న నియంత్రణలను కూడా అతి వేగంగా ఎత్తివేయడం ఉత్తమం. ఈ వయో నిబంధనలు, రోగాల జాబితాలు ఎత్తివేసి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండింటిలోనూ వాక్సిన్‌ ఇబ్బడిముబ్బడిగా లభించేట్టు చూసి, కనీసం ముప్పయ్యేళ్ళుదాటిన వారంతా వాక్సిన్‌ వేయించుకోగలిగే అవకాశం కల్పిస్తే హెర్డ్‌ ఇమ్యూనిటీ మీద నమ్మకాలు పెట్టుకోవచ్చు. వాక్సినేషన్‌ వేగాన్ని ఈ రీతిన పెంచాల్సిన అవసరం ఉంది. పాజిటివిటీ రేటు పెరగడం, మరణాల రేటు హెచ్చడం ప్రమాద సంకేతాలే. గతంలో వైరస్‌ గ్రామాలకు విస్తరించనందున దానిని సులభంగా కట్టడిచేయగలిగామనీ, ఇప్పుడు ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లోనూ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని ప్రధాని అన్నారు. రోగం ఎక్కడకూ పోలేదు, అది మన మధ్యనే నివురుగప్పిన నిప్పులా ఉన్నమాట నిజం. పరీక్షలు పెంచితే, రోగం బయటపడుతుంది. కరోనామీద విజయం సాధించామనీ, మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా అద్భుతాలు చేశామని ముఖ్యమంత్రులూ, కరోనాను జయించి ప్రపంచానికే మార్గనిర్దేశనం చేశామని దేశ పాలకులూ గొప్పలకు పోతుంటే, దాని పీడ పూర్తిగా తొలగిపోయిందని ప్రజలు భ్రమపడటం సహజం. కరోనాతో సహజీవనం తప్పదంటూ మాల్స్‌ నుంచి స్కూళ్ళవరకూ అన్నీ తెరిచి, బస్సులూ రైళ్ళ రాకపోకలు అనుమతించి, వేడుకలమీద ఆంక్షలు ఎత్తివేసిన తరువాత వైరస్‌ వ్యాప్తి సహజం. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవాలంటూ లాక్‌డౌన్‌ తెరలు తొలగించాక ప్రభువులు ప్రజలను వారి ఖర్మానికి వదిలేశారు. వీరూ మాస్కులూ, సామాజిక దూరాలూ మరిచిపోయారు. గతంలో ఉన్నదానికీ లేనిదానికీ అనవసరంగా భయపడినవారు ఇప్పుడు రోగం విషయంలో ఊహకు అందనంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆర్థికం, ఆరోగ్యం రెండూ కావాలని పాలకులు కోరుకున్నప్పుడు జాగ్రత్తలు, నిబంధనలు కచ్చితంగా అమలయ్యేట్టు చూడాలి. అవేమీ చేయకుండా ఇప్పుడు ప్రజలను తప్పుబట్టి ఏం ప్రయోజనం? రోగం ఉపశమిస్తే అది తమ ప్రతిభేననీ, అది తిరగబెడితే రోగిదే తప్పని పాలకులు వాదిస్తున్నారు. కరోనా వ్యాప్తి పెద్దగా లేని కాలంలో ప్రజలపై అవసరం లేకున్నా లాఠీలతో విరుచుకుపడినవారు, ఇప్పుడు తప్పంతా ప్రజలదే అన్నట్టుగా మాట్లాడటంలో అర్థంలేదు. ప్రధాని ఆశించినట్టుగా కరోనాపై ఈ మలిపోరాటంలో విజయం సాధించాలంటే, దవాయి, కడాయి ఒకేస్థాయిలో అమలు జరగాలి.

Updated Date - 2021-03-18T08:52:58+05:30 IST