మాలిక్ శిక్ష

ABN , First Publish Date - 2022-05-31T06:15:32+05:30 IST

వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తే, కశ్మీర్ లోయ భగ్గుమంటుందని అనుకున్నారు కానీ, చెదరుమదురు నిరసనలు తప్ప మరేమీ కనపడలేదు....

మాలిక్ శిక్ష

వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తే, కశ్మీర్ లోయ భగ్గుమంటుందని అనుకున్నారు కానీ, చెదరుమదురు నిరసనలు తప్ప మరేమీ కనపడలేదు. ఒకటి కాదు, రెండు యావజ్జీవ శిక్షలు, ఇంకా జరిమానాలు యాసిన్ మాలిక్ తీర్పులో ఉన్నాయి. భారతీయ వైమానిక దళం అధికారి హత్య కేసు ఇంకా విచారణలోనే ఉన్నది. అందులో మరణశిక్ష కూడా పడవచ్చు. చూస్తుంటే, కేంద్రప్రభుత్వ భద్రతా ఏజెన్సీల ప్రాసిక్యూషన్ కఠినంగా కనిపిస్తోంది. కశ్మీర్ విషయంలో నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంటే, తక్కిన దేశంలో కేంద్రప్రభుత్వ అభిమానులు, బిజెపి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇంతకాలానికి, చిక్కుముడులను తెగగొట్టే సమర్థమైన ప్రభుత్వం ఢిల్లీలో వెలిసిందని వారు గర్వపడుతున్నారు.


విషయమేమిటంటే, యాసిన్ మాలిక్ తన మీద మోపిన అభియోగాలకు ‘దోషిని’ అంటూ అంగీకరించినందువల్లనే ఎన్ఎఐ కోర్టు యావజ్జీవ శిక్షలను విధించింది. తన నేరాంగీకారం కూడా ఒక రాజకీయ ప్రకటన అని, తనకు పడే శిక్ష కశ్మీర్‌లో కదలిక తెస్తుందని అతను ఆశించినట్టు ఉన్నాడు. కానీ, కశ్మీర్‌లో ప్రస్తుతం రాజకీయ నిశ్శబ్దం, ప్రత్యేకమైన ప్రశాంతత నెలకొని ఉన్నాయి. అడపాదడపా మిలిటెంట్ల దాడులు, భద్రతా దళాలు చేసే ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి కానీ, రాజకీయమైన క్రియాశీలత అన్నది మచ్చుకైనా లేదు. అప్పుడప్పుడు గుప్‌కార్ కూటమి వారు కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. రహదారులు, సొరంగాలు, కొత్త పెట్టుబడుల సదస్సులు, రాజకీయ లాభం కలిగించే డీలిమిటేషన్ ప్రక్రియ, కశ్మీర్‌కు తరలివెళ్లడానికి స్థానికేతరులకు ప్రోత్సాహం అన్నీ జరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రకటిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతున్న పనులే. వీటికి నిరసన కానీ, ప్రతిఘటన కానీ పెద్దగా లేదన్నదే విశేషం.


ముప్పై ఐదేళ్ల కిందట మొదలైన కశ్మీర్ ప్రస్తుత మిలిటెన్సీ దశ గురించి, ప్రస్తుత భారత జనాభాలో అత్యధికులకు తెలియదు. తెలిసినా, సమకాలంలో చూసి, విని తెలుసుకున్నట్టు ఉండదు. వివిధ పక్షాలు తమకు అనుకూలంగా ప్రచారంలో పెట్టుకున్న కథనాలే వ్యాప్తిలో ఉంటాయి. యాసిన్ మాలిక్ గురించి కూడా ప్రస్తుత యువతరానికి పెద్దగా తెలిసే అవకాశం లేదు. మాలిక్ నాయకుడిగా ఉన్న జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్)కు సుమారు ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్నది. సీనియర్ నేతలు మగ్బూల్ భట్, అమానుల్లా ఖాన్ స్థాపించిన ఆజాద్ కశ్మీర్ ప్లెబిసైట్ ఫ్రంట్ అనుబంధ సంస్థగా మొదలై, 1977లో ప్రత్యేక సంస్థగా అవతరించిన జెకెఎల్ఎఫ్, భారత్, పాకిస్థాన్‌లలో భాగంగా ఉన్న కశ్మీర్ ప్రాంతాలన్నిటిలోనూ పనిచేసేది. మతంతో నిమిత్తంలేని, కశ్మీరీ జాతి ప్రాతిపదికగా, భారత్ నుంచి పాకిస్థాన్ నుంచి విడిగా ప్రత్యేక దేశంగా ఉండాలనేది ఆ సంస్థ ఆశయం. 1980 దశకం చివరలో నిర్వహించిన కశ్మీరీ ఎన్నికలలో అవకతవకల దరిమిలా ప్రారంభమైన మిలిటెన్సీలో జెకెఎల్ఎఫ్, యాసిన్ మాలిక్ క్రియాశీలపాత్ర వహించారు. దీర్ఘకాలం నిర్బంధం తరువాత 1994లో విడుదలైనప్పుడు కశ్మీర్ లోయలో ఆయనకు ఘనస్వాగతం ఇచ్చారు. యాసిన్ మాలిక్ జైలునుంచి బయటకు వచ్చే సమయానికి కశ్మీర్ మిలిటెన్సీని పాకిస్థాన్ అనుకూల హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబా వంటి సంస్థలు చేజిక్కించుకున్నాయి. క్రమంగా మాలిక్ సాయుధ పోరాట మార్గం నుంచి తప్పుకుని, రాజకీయ పోరాట పంథాను ఎంచుకున్నారు. అటల్ బిహారీ వాజపేయి ప్రధానిగా ఉండగా జరిగిన రాజకీయ ప్రక్రియను మాలిక్ స్వాగతించారు. తరువాత మన్మోహన్ సింగ్‌ను స్వయంగా కలసి చర్చలు నిర్వహించిన కశ్మీరీ నేతలలో యాసిన్ మాలిక్ కూడా ఉన్నారు. తాను గాంధేయ మార్గంలోకి వచ్చానని మాలిక్ చెప్పినప్పటికీ, ఆయన ఆచరణ అందుకు భిన్నంగా ఉన్నదన్నది ప్రాసిక్యూషన్ అభియోగం. 2017లో కశ్మీర్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలకు మాలిక్ ధనం సమకూర్చారన్నది ప్రధాన ఆరోపణ. అధికరణం 370 రద్దయి, జమ్మూకశ్మీర్ కుంచించుకుపోయి కేంద్రపాలిత ప్రాంతంగా మిగిలి, అక్కడ స్థితిగతులలో మార్పుకు కారణమవుతున్న పరిణామాల నేపథ్యంలో, తన శిక్ష ప్రజలలో కదలిక తెస్తుందని ఆశించిన యాసిన్ మాలిక్ ఆశాభంగం చెంది ఉంటారు.

బిజెపి దూకుడు, కేంద్రప్రభుత్వం కార్యశూరత విశేషాలే అయినప్పటికీ, ఇటీవలి చర్యల వల్ల, ఇప్పుడు తీసుకుంటున్న చర్యల వల్ల కశ్మీర్ సమస్య పూర్తిగా పరిష్కారమైందని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఉక్కుపాదాలు చరిత్రగాయాలను మాన్పలేవు. కశ్మీర్ విషయంలో ఇంత నిక్కచ్చిగా ఉంటున్న కేంద్రం, నాగా తిరుగుబాటుదారులతో ఎంత సంయమనంతో చర్చలు జరుపుతున్నదో గమనించాలి. కశ్మీర్‌లో సాధారణ రాజకీయవ్యవస్థ అదృశ్యమైపోయింది. ప్రభుత్వం నిర్బంధించడం వల్ల కొంత, ప్రజలలో విశ్వాసం పోయినందువల్ల మరికొంత. మరి రేపు కశ్మీరీ ప్రజలతో సంభాషించాలంటే, ఒక సంధానకర్త కావాలంటే ఎవరు ఉన్నారు? కశ్మీరీ ప్రజలకు ప్రాతినిధ్యమే లేకుండా చేస్తే, అది కలిగించే పర్యవసానాలేమిటో తెలియదు కదా? కశ్మీర్ విషయంలో ఒక సామరస్య పరిష్కారానికి ప్రయత్నించిన వ్యక్తిగా యాసిన్ మాలిక్‌కు ఉన్న విశ్వసనీయత కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ఉండవలసింది. స్వయంగా నేరాంగీకారం చేసినందువల్ల న్యాయస్థానానికి మరో మార్గం లేకపోవచ్చును కానీ, ప్రభుత్వ వ్యవహార సరళిలో పట్టువిడుపులు ఉండాలి కదా!

Updated Date - 2022-05-31T06:15:32+05:30 IST