మలిదేవి డ్రైన్‌కు ‘కనిగిరి’ జలాలు

ABN , First Publish Date - 2022-01-21T05:05:54+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్‌ నుంచి గురువారం నీటిపారుదలశాఖ అధికారులు 300 క్యూసెక్కుల నీటిని మలిదేవి (డ్రైన్‌) కాలువకు విడుదల చేశారు.

మలిదేవి డ్రైన్‌కు ‘కనిగిరి’ జలాలు
మలిదేవి కాలువ గుండా సముద్రం పాలవుతున్న కనిగిరి జలాలు

విస్తుపోతున్న రైతులు

 

బుచ్చిరెడ్డిపాళెం, జనవరి 20: బుచ్చిరెడ్డిపాళెంలోని కనిగిరి రిజర్వాయర్‌ నుంచి గురువారం నీటిపారుదలశాఖ అధికారులు 300 క్యూసెక్కుల నీటిని మలిదేవి (డ్రైన్‌) కాలువకు విడుదల చేశారు. సమాచారం తెలుసుకున్న రైతులు విస్తుపోతున్నారు. మలిదేవి కాలువకు వదలిన నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. గతేడాది నవంబరులో భారీగా వర్షాలు కురిసిన సమయంలో కనిగిరి రిజర్వాయర్‌కు పెన్నా జలాలు నింపడంలో మొగ్గు చూపని అధికారులు ఇప్పుడు కనిగిరి రిజర్వాయర్‌కు నీరు నింపడం, ఎక్కువయ్యాయని మలిదేవి కాలువకు నీరు విడుదల చేయడంలో ఆంతర్యమేమిటోనని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై ఏఈ వినయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. సోమశిల జలాశయం నుంచి వరద నీరు పెన్నానదికి విడుదల చేసినట్లు తెలిపారు. ఈ వరద నీటిని కనుపూరు, కావలి కాలువలకు తరలించడం కోసం కనిగిరి రిజర్వాయర్‌కు 1000 క్యూసెక్కులు తీసుకునేలా అధికారుల ఆదేశాల మేరకు నింపినట్లు పేర్కొన్నారు. దీంతో రిజర్వాయర్‌ 20.5 అడుగుల (3.5టీఎంసీలు)మేర సామర్థ్యానికి చేరుకుందన్నారు. ఈ కారణంగా పైడేరు చానల్‌కు, మలిదేవి మిట్ట కలుజుల ద్వారా మలిదేవి కాలువకు సుమారు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తెలిపారు.


Updated Date - 2022-01-21T05:05:54+05:30 IST