రామాయంపేట డివిజన్‌ కోసం మలిదశ ఉద్యమం

ABN , First Publish Date - 2021-08-04T04:18:37+05:30 IST

రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కోసం మలిదశ ఉద్యమం చేపడతామని మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు.

రామాయంపేట డివిజన్‌ కోసం మలిదశ ఉద్యమం
రామాయంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి

మెదక్‌ ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ తీర్మానం

కాంగ్రెస్‌ పార్టీలో భారీగా చేరికలు


రామాయంపేట, ఆగస్టు 3: రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ కోసం మలిదశ ఉద్యమం చేపడతామని మెదక్‌ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయిస్తామన్న మంత్రి, ఎమ్మెల్యేలు తమ హామీలను విస్మరించారన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నింటినో ప్రతిపాదించినప్పటికీ ఒకనాటి నియోజకవర్గ కేంద్రంగా ఉన్న రామాయంపేటను కనీసం రెవెన్యూ డివిజన్‌ చేయకపోవడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రామాయంపేట మండల కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేల రాజీనామా తప్పనిసరి అని, అందువల్ల మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తక్షణమే రాజీనామా చేయాల్సిందిగా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ వైపు జనం ఆసక్తిగా చూస్తున్నారని, టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలతో విసిగిన ప్రజానీకం భవిష్యత్తులో కాంగ్రెస్‌ను గెలిపించబోతున్నారని జోస్యం చెప్పారు. ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రప్రజలను ఏడిపిస్తున్నారని దుయ్యబట్టారు. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్‌ హయాంలోనే అని ఆయన గుర్తుచేశారు. 


కాంగ్రె్‌సలో భారీగా చేరికలు

కంఠారెడ్డి నేతృత్వంలో యువకులు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. మంగళవారం రామాయంపేటలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కాట్రియాల, పర్వతాపూర్‌ ప్రాంతాల నుంచి సుమారు 80 మంది కాంగ్రెస్‌పార్టీలో చేరగా డీసీసీ అధ్యక్షుడు కండువాకప్పి వారిని ఆహ్వానించారు. సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, కాంగ్రెస్‌ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు పల్లె రాంచందర్‌గౌడ్‌, యువత విభాగం జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, స్థానిక మాజీ ఎంపీపీ రమేష్‌రెడ్డి, కౌన్సిలర్‌ అనిల్‌,  పార్టీ మండల అధ్యక్షుడు శ్యాంరెడ్డి, మండల యూత్‌ అధ్యక్షుడు చింతల యాదగిరి, హరి, లింగంగౌడ్‌తో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-04T04:18:37+05:30 IST