మేడిన్‌ మలేషియా!

ABN , First Publish Date - 2020-04-03T08:45:17+05:30 IST

నిజాముద్దీన్‌లో జమాత్‌ జరగడానికి ముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఓ భారీ సమావేశం జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచీ 16వేల మంది దీనికి...

మేడిన్‌ మలేషియా!

  • నిజాముద్దీన్‌ భేటీకి ముందే కౌలాలంపూర్‌లో జమాత్‌ భారీ సమావేశం

కౌలాలంపూర్‌, ఏప్రిల్‌ 2: నిజాముద్దీన్‌లో జమాత్‌ జరగడానికి ముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఓ భారీ సమావేశం జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచీ 16వేల మంది దీనికి హాజరయ్యారు. అనేక ఆగ్నేయాసియా దేశాల నుంచి 1500 మంది ఇందులో పాల్గొన్నారు. ఫిబ్రవరి 27-మార్చి 1 మధ్య జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న అనేక మందికి తెలియదు... తాము ఓ ప్రాణాంతక వైరస్‌ బారిన పడ్డామని, పడుతున్నామనీ! దీనిని నిర్వహించినది కూడా తబ్లిగీ జమాతే సంస్థే. కౌలాలంపూర్‌ శివార్లలో స్వర్ణగుమ్మటంతో కూడిన ఓ పెద్ద మసీదు ఉంది. వేల మంది ఆ మసీదులో ఉండడానికి స్థలం చాలదు కాబట్టి వందల సంఖ్యలో డెలిగేట్లు బయట తాత్కాలికంగా ఏర్పాటుచేసిన టెంట్లలో బసచేశారు. ఈ సమావేశంలో అందరూ ఒకరినొకరు తాకుతూనే కూర్చునేవారు. ప్రార్థనలు చేసేవారు. కలిసి భోజనం చేయడం, పదార్థాలను షేర్‌ చేసుకోవడం కూడా జరిగాయి. ఈ సమావేశానికి వెళ్లొచ్చిన వారిలో ఓ 34-ఏళ్ల మలేషియా వాసి మార్చి 17న చనిపోయాడు. ఒక్క మలేషియాలోనే 673 పాజిటివ్‌ కేసులుండగా అందులో రెండొంతుల మందికి ఈ మసీదు సమావేశంతో లింకున్నట్లు తేలింది. దీంతో మలేషియా ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దులు మూసేసింది. ఈ మసీదు సమ్మేళనంలో పాల్గొన్న అనేకమందిని క్వారంటైన్‌ చేసింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో అనేక మంది భారతీయులు కూడా ఉన్నారని తెలుస్తోంది. తబ్లిగీ ప్రధాన కార్యాలయం భారత్‌లోనే ఉండడంతో సహజంగానే న్యూఢిల్లీ, యూపీ, తమిళనాడు, బెంగాల్‌ నుంచి అనేకమంది అక్కడకు వెళ్లినట్లు సమాచారం.


వైరస్‌ ప్రబలంగా వ్యాపించిన చైనా, దక్షిణ కొరియాల నుంచి కూడా ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. వీరిలో ఎవరికి వైరస్‌ ఉందో ఎవరికీ తెలియదు. ఇండొనీషియా, థాయ్‌లాండ్‌, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, కంబోడియా, సింగపూర్‌, బ్రూనై సహా అనేక దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో వైరస్‌ ప్రస్తుత వ్యాప్తికి ఈ సమావేశమే కారణమన్నది కొన్ని ప్రభుత్వాల అంచనా. ‘మత సమావేశాల్లో ఒకరి చేతులు మరొకరు పట్టుకోవడం సర్వసాధారణం. మేమంతా అలానే చేశాం. కలిసి భోజనం చేశాం. పక్కపక్కనే నిద్రించాం’ అని కంబోడియాకు చెందిన ఓ ప్రతినిధి చెప్పారు. ఐరోపా దేశాల నుంచి కూడా ప్రతినిధులు దీనికి హాజరైనట్లు తెలుస్తోంది. 


Updated Date - 2020-04-03T08:45:17+05:30 IST