పేకాటలో 4 మిలియన్ పౌండ్లు నష్టపోయిన బిజినెస్‌మ్యాన్... తనకు నచ్చజెప్పి ఆపలేకపోయారంటూ కేసినోపై దావా...

ABN , First Publish Date - 2022-01-29T16:19:30+05:30 IST

ఆస్పినల్స్ కేసినోలో కార్డ్ గేమ్ ఆడి, దాదాపు 3.9 మిలియన్ పౌండ్లు

పేకాటలో 4 మిలియన్ పౌండ్లు నష్టపోయిన బిజినెస్‌మ్యాన్... తనకు నచ్చజెప్పి ఆపలేకపోయారంటూ కేసినోపై దావా...

లండన్ : ఆస్పినల్స్ కేసినోలో కార్డ్ గేమ్ ఆడి, దాదాపు 3.9 మిలియన్ పౌండ్లు నష్టపోయిన మలేసియన్ వ్యాపారవేత్త హాన్ జోయెహ్ లిమ్ ఆ కేసినోపై దావా వేశారు. తాను నష్టాల బాటలో పయనిస్తున్న సమయంలో తనకు నచ్చజెప్పి, ఆట నుంచి తప్పుకునేలా ఎందుకు చేయలేకపోయారని ఆ కేసినోను నిలదీశారు. 


హాన్‌ (62)కు 40 మిలియన్ పౌండ్ల సంపద ఉంది. లండన్‌లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయి. 2014లో ఆయన ఈ కేసినోలో సభ్యునిగా చేరారు. 6 లక్షల పౌండ్ల క్యాష్ చెక్స్ ఇచ్చేందుకు ఆయనకు అనుమతి ఉంది. 2015లో కార్డ్ గేమ్ ఆడినపుడు ఈ పరిమితి దాటిపోయిన తర్వాత ఆయన క్రెడిట్ పరిమితిని 1.9 మిలియన్ పౌండ్లకు ఆ కేసినో పెంచింది. అది కూడా నష్టపోయిన తర్వాత మరో 2 మిలియన్ పౌండ్ల క్రెడిట్‌ను అనుమతించింది. దీనిని కూడా ఆయన నష్టపోయారు. 


ఈ సొమ్మును ఆయన చెల్లించకపోవడంతో ఆ కేసినో ఆయనపై దావా వేసింది. ఈ కేసులో ఆ కేసినో 2019లో విజయం సాధించింది. నాలుగు కోర్టు ఆర్డర్స్‌ను ధిక్కరించినందుకు ఆయనకు 1,00,000 పౌండ్ల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 


గ్యాంబ్లింగ్ యాక్ట్, 2005 ప్రకారం నిర్వహించవలసిన బాధ్యతలను ఆస్పినల్స్  కేసినో నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. తనకు 3.9 మిలియన్ పౌండ్లు చెల్లించాలని ఆదేశించాలని కోర్టును కోరారు. జూదంలో దెబ్బతినకుండా, దోపిడీకి గురి కాకుండా బలహీనులను కాపాడాలని ఈ చట్టం చెప్తోందన్నారు. జూదంలో నష్టపోయినదానిని మళ్ళీ రాబట్టుకోవడం కోసం తాను ప్రయత్నించడాన్ని ఈ కేసినో సానుకూలంగా మలచుకుందని ఆరోపించారు. మరింత ఎక్కువ సమయం జూదం ఆడటానికి అవకాశం ఇవ్వడంతోపాటు అదనపు నిధులను కూడా అనుమతించిందని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిపారు. ఈ దావాను రద్దు చేయాలని కేసినో తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.


Updated Date - 2022-01-29T16:19:30+05:30 IST