తిరుమలలో నిర్వహించే వివిధ ఉత్సవాల్లో మలయప్ప స్వామిని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఉంటారు. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ఊరేగింపు మలయప్ప స్వామికి జరగడం ఏమిటనే సందేహం సహజం. ఇంతకీ.... ఉత్సవమూర్తి అయిన ఈ మలయప్పస్వామి ఎవరు? తిరుమల ఆలయంలోని మూలవిరాట్టును ‘ధ్రువ బేర’ అంటారు. స్థిరమైన ఆ ప్రతిమను కదల్చకూడదు. కాబట్టి ఉత్సవాల కోసం, గర్భగుడికి బయట చేసే సేవల నిమిత్తం మరో ప్రతిమను వినియోగిస్తారు. దాన్ని ‘ఉత్సవ బేర’ అంటారు. పూర్వం ఉగ్ర శ్రీనివాసుడి విగ్రహం ‘ఉత్సవ బేర’గా ఉండేది. ఒకసారి ఊరేగింపులో మంటలు చెలరేగాయి. శాంతంగా ఉండే మూర్తిని ఉత్సవాల్లో ఉపయోగించాలని ఒక భక్తుడి ద్వారా స్వామి వెల్లడిస్తూ, అవి దొరికే చోటును కూడా చెప్పారట! ఆ మేరకు అన్వేషించగా... వంగి ఉన్న ఒక కొండ దగ్గర దేవేరులతో సహా శ్రీ వేంకటేశ్వరుడి విగ్రహాలు దొరికాయట. ఆ స్వామికి ‘మలై కునియ నిన్ర పెరుమాళ్’ అని పేరు పెట్టారు. అంటే ‘వంగి ఉన్న పర్వతం మీద కొలువైన వేంకటేశ్వరుడు’ అని అర్థం. ఆ పేరే మలయప్ప స్వామిగా వాడుకలోకి వచ్చింది. మలయప్ప స్వామి పంచలోహ విగ్రహాన్నే తిరుమల గర్భగుడి బయట నిర్వహించే అన్ని వేడుకలకూ, వాహన సేవలకు వినియోగిస్తారు.