భర్తకు కేన్సర్.. చికిత్స కోసం డబ్బులు సంపాదించేందుకు Kuwait కు వెళ్లిన ఈ భార్యకు ఊహించని కష్టం.. చివరకు..

ABN , First Publish Date - 2022-05-09T22:20:03+05:30 IST

ఓవైపు పేదరికం.. మరోవైపు భర్తకు కేన్సర్.. దీంతో ఆ యువతి ఉక్కిరిబిక్కిరైపోయింది. భర్తకు చికిత్స చేయించేందుకు డబ్బులు లేక అలమటించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆమె గల్ఫ్‌కు వెళ్లాలనుకుంది. అనుకున్నట్టే అక్కడికి చేరకున్న ఆమెకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి.

భర్తకు కేన్సర్.. చికిత్స కోసం డబ్బులు సంపాదించేందుకు Kuwait కు వెళ్లిన ఈ భార్యకు ఊహించని కష్టం.. చివరకు..

ఎన్నారై డెస్క్: ఓవైపు పేదరికం.. మరోవైపు భర్తకు కేన్సర్.. దీంతో ఆ యువతి ఉక్కిరిబిక్కిరైపోయింది. భర్తకు చికిత్స చేయించేందుకు డబ్బులు లేక అలమటించింది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆమె గల్ఫ్‌కు వెళ్లాలనుకుంది. అనుకున్నట్టే అక్కడికి చేరకున్న ఆమెకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. తనను పనిలో పెట్టుకున్న కువైత్ వ్యక్తి ఆమెను నానా రకాల ఇబ్బందులు పెట్టాడు. చివరకు ఓ ఎన్‌జీఓ, రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వమ్ బాధితురాలికి సాయం చేయడంతో ఆమె సురక్షితంగా స్వదేశానికి చేరుకోగలిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..


కేరళ రాష్ట్రం వేయనాడ్ జిల్లాకు చెందిన లిండా బినోజ్..కొంత కాలం క్రితం ఓ ఏజెంట్ సాయంతో కువైత్‌కు వెళ్లింది. లిండా భర్త నాలుగేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్నాడు. అతడి చికిత్సకు కావాల్సిన డబ్బులు సమకూర్చుకునేందుకు స్వదేశాన్ని వీడింది. కువైత్‌లోని ఓ వ్యక్తి ఇంట్లో పనికి కుదిరింది. ‘‘జనవరిలో నేను కువైత్‌ వెళ్లాను. ఇందుకోసం దాదాపు రూ. 3 లక్షలు అప్పు చేయాల్సి వచ్చింది. మొదట్లో నాకు వాళ్లు రూ. 32 వేల వరకూ శాలరీ ఇస్తామన్నారు. ఆ తరువాత.. దాన్ని రూ. 27,578కు కుదించారు. అది కూడా మొదటి రెండు నెలలే నాకు సక్రమంగా ఇచ్చారు. ఆ తరువాత పైసా కూడా చేతిలో పెట్టలేదు. పైపెచ్చు.. నన్ను పనిలో పెట్టుకున్న వ్యక్తి శారీరకంగా హింసించాడు. అయితే.. గ్లోబల్ కేరళ ప్రవాసీ అసోసియేషన్ సాయంతో నేను భారత ఎంబసీ వాళ్లను కలుసుకోగలిగాను ’’ అని లిండా తన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఎంబసీ సహాయం చేయడంతో ఆమె సురక్షితంగా భారత్‌కు చేరుకోగలిగింది. 


కువైత్ కష్టాల నుంచి ఆమె తప్పించుకోగలిగినప్పటికీ.. భర్త వైద్య ఖర్చులకు డబ్బు ఎలా సమూకూర్చుకోవాలో తెలీక లిండా ఆందోళన చెందుతోంది. ‘‘మాకు సొంతిల్లు లేదు. ఓ షెడ్ వేసుకుని ఉంటున్నాం. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఇంట్లో కొంత భాగం దెబ్బతింది. పిల్లల చదువులకు కూడా డబ్బులు కావాలి. నా చిన్న కుమారుడికి హెర్నియా ఆపరేషన్‌కు కూడా డబ్బులు అవసరం’’ అని ఆమె చెప్పుకొచ్చింది. లిండాకు ముగ్గురు పిల్లలున్నారు. ఇన్ని కష్టాలున్నా కూడా తాను కొంతవరకూ అదృష్టవంతురాలినేనని లిండా పేర్కొంది. ‘‘అదృష్టం బాగుండబట్టే..కువైత్‌లో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తి టార్చర్ నుంచి తప్పించుకోగలిగాను. ఇక ఇక్కడే ఏదోక ఉద్యోగం వెతుక్కుంటాను’’ అని లిండా పేర్కొంది.

Read more