కర్ణాటక హిజాబ్ వివాదంపై మలాలా స్పందన ఏమిటంటే...

ABN , First Publish Date - 2022-02-09T12:49:36+05:30 IST

కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ వివాదంపై నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు...

కర్ణాటక హిజాబ్ వివాదంపై మలాలా స్పందన ఏమిటంటే...

న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజుకున్న హిజాబ్ వివాదంపై నోబెల్ గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ స్పందించారు.‘‘కర్నాటకలో ముస్లిం అమ్మాయిలు హిజాబ్‌లతో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయంకరమైనది...ముస్లిం మహిళలను వెనుకకు నెట్టడాన్ని నాయకులు ఆపాలి’’ అని మలాలా వ్యాఖ్యానించారు. ‘‘ముస్లిం అమ్మాయిలు తమ హిజాబ్‌లతో పాఠశాలకు వెళ్లడానికి నిరాకరించడం భయానకమైనది. మహిళలు హిజాబ్ ధరించడంపై అభ్యంతరం కొనసాగుతోంది. భారత నాయకులు ముస్లిం మహిళలను అణగదొక్కడాన్ని ఆపాలి.’’అని మలాలా ట్విటర్‌లో రాశారు.కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో పలువురు ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి కళాశాల ప్రాంగణంలోకి రాకుండా నిషేధం విధించిన నేపథ్యంలో మలాలా ఈ వ్యాఖ్యలు చేశారు.


హిజాబ్ ధరించడం తమ ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని కోరుతూ ముస్లిం విద్యార్థినులు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పై విచారణ కొనసాగనుంది.హిజాబ్ వివాదంపై అనేక జిల్లాల్లో నిరసనలు చెలరేగాయి. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారులు రాళ్లదాడికి పాల్పడడంతో దావంగెరె, షిమోగా, బాగల్‌కోట్‌లలో 144 సెక్షన్‌ విధించారు.సమస్య పరిష్కారమయ్యే వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశించారు. ప్రజలందరూ శాంతిభద్రతలు కాపాడాలని కర్ణాటక హైకోర్టు కూడా కోరింది.


హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో చెలరేగిన హింసకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ విద్యార్థిని ‘అల్లా హు అక్బర్’ అని గట్టిగా నినదించడం కనిపించింది. కాషాయ కండువాలు ధరించిన మరో వర్గం విద్యార్థులు ‘జై శ్రీరామ్’ అని నినదిస్తుండగా, ప్రతిగా ఆమె వారి ఎదుట ధైర్యంగా ‘అల్లా హు అక్బర్’ అని నినాదాలు చేసింది.


Updated Date - 2022-02-09T12:49:36+05:30 IST