ఆపద వేళ అండగా

ABN , First Publish Date - 2022-01-20T16:52:52+05:30 IST

కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేకమంది భయాందోళన చెందుతున్నారు.

ఆపద వేళ అండగా

కొవిడ్‌ సోకిన తల్లీబిడ్డలకు భరోసా

గర్భిణులకు మలక్‌పేట ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలు


సైదాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అనేకమంది భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు. గర్భిణులకు పాజిటివ్‌ వస్తే ఒకింత ఆందోళనే. ప్రసవ సమయంలో వారి ఆరోగ్యాన్ని కాపాడుతూనే గర్భం లోని శిశువును రక్షించాల్సి ఉంటుంది. మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి (పోలీస్‌ ఆస్పత్రి) వైద్యుల బృందం కరోనా సోకిన గర్భిణులకు సేవలందిస్తూ వారి మన్ననలు పొందుతోంది. గత అక్టోబర్‌ నుంచి మలక్‌పేట ఆస్పత్రిలో కరోనా బారిన పడిన 27 మంది గర్భిణులకు ప్రసవాలు నిర్వహించారు. తాజాగా వారం రోజుల క్రితం ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు కరోనా ఉన్నట్లు పరీక్షల్లో నిర్థారణ కావడంతో ఆమెకు ధైర్యం చెప్పి చికిత్స అందించారు. ఐదు రోజుల క్రితం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని, ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు. 


పక్కా ప్రణాళికతో వైద్య పరీక్షలు

కరోనా సమయంలో పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షల కోసం వస్తున్నా గర్భిణులకు ఏ ఇబ్బంది రాకుండా పక్కా ప్రణాళికతో వైద్య సేవలందిస్తున్నారు. ఆస్పత్రిలో నలుగురు గైనకాలజిస్టులున్నారు. ఉదయం 9 గంటలకు ఓపీ (ఔట్‌పేషెంట్‌) సేవలు ప్రారంభమవుతాయి. సోమవారం 800-1000 మంది వరకు వస్తుంటారు. మిగతా రోజుల్లో 100-150 మంది వస్తుంటారు. తొలుత రిజిస్ర్టేషన్‌ కౌంటర్‌ వద్ద ఓపీ రసీదు తీసుకుని, ఆ తర్వాత గైనకాలజీ వైద్యురాలి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన వారికి ఉచితంగా స్కానింగ్‌, ఇతర పరీక్షలు చేసి మందులు ఇస్తున్నారు. సాధారణంగా ఆస్పత్రిలో రోజుకు 5 నుంచి 9 వరకు కాన్పులు జరుగుతున్నాయి.


జాగ్రత్తలతో శస్త్రచికిత్సలు

పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు పురిటి నొప్పులు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకువెళ్లే క్రమంలో వెద్యులు మాస్కులతో పాటు పీపీఈ కిట్లు ధరిస్తున్నారు. ఆపరేషన్‌ ముందు, అనంతరం థియేటర్‌ను పూర్తిగా శానిటైజేషన్‌ చేస్తున్నారు. శస్త్రచికిత్స చేసిన తదుపరి శిశువులకు నవజాత శిశువు కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో వైద్యులు సేవలందిస్తున్నారు. తల్లితో పాటు బిడ్డకు నెగెటివ్‌ వచ్చే వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆస్పత్రిలో అధునాతన వసతులు ఉండటం, మెరుగైన వైద్యం అందుతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి గర్భిణులు వస్తున్నారు. 


పాజిటివ్‌ వచ్చినా సేవలు

గత నెలలో 10 మంది పాజిటివ్‌ వచ్చిన గర్భిణులకు కాన్పులు చేశారు. వీరికి ప్రత్యేక వార్డుల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడంతో వైద్యులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నవజాత శిశివుకు పాజిటివ్‌ ఉన్నా యాంటీబాడీస్‌ సంఖ్య ఎక్కువగా ఉంటాయి. దీనికి అనుగుణంగా పిల్లల వైద్యులు సేవలందిస్తున్నారు. 


ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం

గర్భిణులు, నవజాత శిశువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. డాక్టర్లు, సిబ్బంది సహకారంతో మెరుగైన వైద్యసేవలందిస్తున్నాం. పాజిటివ్‌ వచ్చిన గర్భిణులు భయాందోళనకు గురికావద్దు. ఆస్పత్రిలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, పరీక్షలు జరుగుతున్నా వైద్య సేవలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.

  - డాక్టర్‌ త్రిలోక్‌ శ్యాం, సూపరింటెండెంట్‌, మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి

Updated Date - 2022-01-20T16:52:52+05:30 IST