విజేతలను తయారు చేస్తోంది!

ABN , First Publish Date - 2021-03-10T05:30:00+05:30 IST

‘‘మానాన్న భారత నౌకాదళంలో నాన్‌ కమిషన్డ్‌ అధికారిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. చిన్నప్పటి నుంచి సాయుధ బలగాల వాతావరణంలో పెరగడంతో నాకు ఆర్మీ యూనిఫామ్‌ అంటే ఎంతో ఇష్టం. ప్లస్‌ టూ తరువాత డాక్టర్‌ కోర్సు పరీక్ష రాశాను

విజేతలను తయారు చేస్తోంది!

ప్రతిభ, శక్తియుక్తులు ఉన్నప్పటికీ పోటీపరీక్షలో విజయం ముంగిట తడబడే వాళ్లు చాలామంది. అలాంటివాళ్లకు సరైన శిక్షణ ఇచ్చి గెలుపు బాటలో నడిపిస్తున్నారు శివాని సోని. కంబైండ్‌ డిఫెన్స్‌ పరీక్షలో నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లిన అనుభవంతో ఆమె ఇప్పుడు దేశానికి ఉత్తమ అధికారులను అందించే పనిలో ఉన్నారు. సాయుధ దళంలో చేరాలనే వందలాది మంది యువత కలను నిజం చేస్తున్న ఈ యువతరంగం అంతరంగమిది...


నేను పరీక్షలో విజయం సాధిస్తే దేశానికి ఒక్కశాతం మాత్రమే మేలు జరుగుతుంది. అదే నాలాంటి ఎందరికో నేను శిక్షణ ఇస్తే ప్రతి ఏడాది ఉత్తమ అధికారులను దేశానికి అందిస్తాను అనుకున్నా. 


‘‘మానాన్న భారత నౌకాదళంలో నాన్‌ కమిషన్డ్‌ అధికారిగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. చిన్నప్పటి నుంచి సాయుధ బలగాల వాతావరణంలో పెరగడంతో నాకు ఆర్మీ యూనిఫామ్‌ అంటే ఎంతో ఇష్టం. ప్లస్‌ టూ తరువాత డాక్టర్‌ కోర్సు పరీక్ష రాశాను. కానీ ఆ పరీక్షలో పాస్‌ కాలేదు. ఆ పరీక్ష ఫలితం నా జీవిత లక్ష్యాన్నే మార్చేసింది. ఆ తరువాతా పుణేలోని సాయుధ బలగాల వైద్య కళాశాలలో చేరాను. నేను కంబైంన్డ్‌ డిఫెన్స్‌ పరీక్షకు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఏయే పుస్తకాలు చదవాలో తేల్చుకోవడానికే దాదాపు 8 నెలలు పట్టింది. కావాల్సిన సమాచారం అంతా ఒకే పుస్తకంలో లేదని గమనించాను. నా పరిస్థితే ఇలా ఉంటే ఇంటర్నెట్‌ సౌకర్యం, శిక్షణనిచ్చే వారు దొరకని చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులు పడే కష్టాలు గుర్తుకొచ్చాయి. రాత పరీక్ష దాటి నాలుగు సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. కానీ విజయం సాధించలేదు. ఎక్కువ డబ్బులు పెట్టి కోచింగ్‌ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయితే కొన్ని పరీక్షలు రాసిన తరువాత యూపీఎస్సీ మన మార్కులు, చదువు నైపుణ్యాలను కాదు మన వ్యక్తిత్వాన్ని చూస్తుందనే విషయం నాకు అర్థమైంది. 


నా జీవిత లక్ష్యం మారిందలా 

ప్రతి ఏడాది 9, 10 గ్రేడ్‌ సాధించిన విద్యార్థులు పోటీ పడతారు. కానీ వారెవ్వరూ విజయం సాధించరు. అప్పటికే నేను నా స్నేహితులకు పలు పోటీ పరీక్షల మెలకువలు చెప్పేదాన్ని. నాలాగే పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు పరీక్ష గట్టెక్కేలా సాయం చేయాలనే ఆలోచన తట్టింది నాకు. రాజ్‌కోట్‌ యూనివర్సిటీ నుంచి ఫార్మసీలో డిగ్రీ పట్టా అందుకున్న తరువాత నేరుగా ఢిల్లీ వెళ్లాను. ఒక ఇన్‌స్టిట్యూట్‌లో పోటీపరీక్ష పాఠాలు చెప్పడం మొదలెట్టాను. యూట్యూబ్‌లో ఉచితంగా ట్యుటోరియల్స్‌ అందిస్తున్న ‘డిఫెన్స్‌ మానియా’ వీడియోలు చూశాను. అవి కొంత సంక్లిష్టంగా ఉండడం చూసి  ఆ సంస్థ  డైరెక్టర్‌ సాహిల్‌ కుమార్‌ను ట్యూటోరియల్‌ వీడియోలను సులభంగా అర్థమయ్యేలా రూపొందించాల్సిందిగా కోరాను.  


తక్కువ ఫీజుతో మెరుగైన శిక్షణ

మా ఈ-బుక్స్‌ చదివే వారి నుంచి గంటకు 44 రూపాయలు వసూలు చేస్తానని సాహిల్‌కు చెప్పగానే ‘అంత తక్కువకా’అని ఆయన ఆశ్చర్యపోయారు. అభ్యర్థుల ఆలోచనా విధానం, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కవ మంది విద్యార్థులను చేరుకోవాలనే ఉద్దేశంతో టెలిగ్రామ్‌ యాప్‌లో ఒక ఖాతా తెరిచాం. ఏరోజుకారోజు వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌... అభ్యర్థులు అప్‌టూడేట్‌ ఉండేందుకు సమాచారం అంతా అందించేవాళ్లం. అయితే విద్యార్థుల సంఖ్య పెరిగేసరికి వారి మీద ఒక అంచనాకు రావడం కష్టం అయ్యేది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు డిఫెన్స్‌ మానియా ఎడ్యుకేషన్‌ టెక్‌ వేదికైనా ‘క్లాస్‌ప్ల్‌స’తో కలిసి ‘.డిఫెన్స్‌ మానియా’ యాప్‌ రూపొందించాం.ప్రత్యేకంగా శిక్షణ కావాలనుకనే వారి అవసరాలకు తగ్గట్టుగా సమాచారాన్ని రూపొందిస్తాం. తొలినాళ్లలో 9వేలు ఉన్న సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య ఏడాదిలోనే 50 వేలకు చేరింది. ఈ రెండేళ్లలో మా వద్ద శిక్షణ తీసుకున్న వారిలో వెయ్యి మందికి పైగా యూపీఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల్లో విజయం సాధించారు’’.

Updated Date - 2021-03-10T05:30:00+05:30 IST