మేకప్‌ వేసి... ముడతలు దాచి...

ABN , First Publish Date - 2022-05-15T06:12:18+05:30 IST

పెరిగే వయసుతో ముఖం మీద ఏర్పడే సన్నని గీతలు, ముడతలను పూర్తిగా కనిపించకుండా చేయడం అసాధ్యం.

మేకప్‌ వేసి... ముడతలు దాచి...

పెరిగే వయసుతో ముఖం మీద ఏర్పడే సన్నని గీతలు, ముడతలను పూర్తిగా కనిపించకుండా చేయడం అసాధ్యం. అయితే  కొన్ని మేకప్‌ మెలకువలతో వాటిని కొంత మేరకు దాచే వీలుంది. అదెలాగంటే...


సీరం, మాయిశ్చరైజర్‌: 40 ఏళ్లు దాటిన తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్‌తో పాటు సీరమ్‌ కూడా అప్లై చేసుకోవాలి. ఇందుకోసం మొదట సీరం పూసుకుని, తర్వాత మాయిశ్చరైజర్‌ పూసుకోవాలి. హైల్యురోనిక్‌ యాసిడ్‌ కలిగి ఉండే సీరంను మాత్రమే ఎంచుకోవాలి. దీంతో చర్మంలోని తేమ నిలిచి ఉంటుంది. మేకప్‌కు ముందు ఇలాంటి సీరం వాడుకుంటే, ముడతల తీవ్రత తగ్గుతుంది.


సిలికాన్‌ ప్రైమర్‌: ఫౌండేషన్‌ అప్లై చేయడానికి తగినట్టు చర్మాన్ని నునుపుగా మార్చడం కోసం ఈ ప్రైమర్‌ ఉపయోగపడుతుంది. ఈ ప్రైమర్‌ను వేళ్లతో ముఖం మీద అప్లై చేసుకోవాలి. బ్రష్‌ లేదా స్పాంజ్‌ ఉపయోగిస్తే ప్రైమర్‌ వాటిలో ఇంకిపోయి, చర్మానికి సమంగా అంటుకోదు. కాబట్టి మాయిశ్చరైజర్‌ అప్లై చేసిన తర్వాత, ప్రైమర్‌ తీసుకుని నుదురు, బుగ్గలు, చుబుకం పైన వేళ్లతో అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్ది నిమిషాలు ఆగి ఫౌండేషన్‌ మొదలుపెట్టాలి.


ఫౌండేషన్‌: ముడతలు ఎక్కువ ఉన్నంత మాత్రాన ఫౌండేషన్‌ ఎక్కువ ఉపయోగించాలి అనుకో కూడదు. ఫౌండేషన్‌ ఎక్కువైతే అది ముడతల్లో ఇరుక్కుపోయి, ముడతలు మరింత స్పష్టంగా కనిపించే ప్రమాదం ఉంది. కాబట్టి లైట్‌ లేదా మీడియం కవరేజ్‌ ఫౌండేషన్‌కే కట్టుబడి ఉండాలి. ఫౌండేషన్‌ను అప్లై చేయడానికి తడిపిన స్పాంజీనే ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఫౌండేషన్‌ సమంగా పరుచుకుని ముడతలు కనిపించకుండా ఉంటాయి


కలర్‌ కరెక్టర్‌: కలర్‌ కరెక్టర్లు కళ్ల కింద వలయాలు, ముదురు రంగులు మచ్చల కోసం ఉద్దేశించినవి మాత్రమే కావు. షిఫాన్‌ కలర్‌ కలెక్టర్‌తో ముఖ వర్ఛస్సు ఆకర్షణీయంగా మారుతుంది. అందుకోసం ముడతల లోపలకు చేరుకునేలా కలర్‌ కరెక్టర్‌ను ఉంగరపు వేలితో అద్దుకోవాలి. అన్ని రకాల చర్మాలకు సూటవ్వాలంటే ఈ కలర్‌ కరెక్టర్‌ను కన్‌సీలర్‌తో కలిపి అప్లై చేసుకోవాలి.


పౌడర్‌ వద్దు: పౌడర్‌ రూపంలోని మేకప్‌ ప్రొడక్ట్స్‌ ముడతల్లోకి చేరిపోతుంది. కాబట్టి మేకప్‌తో ముడతలను తగ్గించాలనుకునేవాళ్లు వీటిని వాడుకోకూడదు. ఒకవేళ పౌడర్‌ లేకుండా మేకప్‌ పూర్తవదు అనుకుంటే, కళ్ల చివర్లలోని ‘క్రోస్‌ ఫీట్‌’, పెదవుల చివర్లలోని ‘లాఫింగ్‌ లైన్స్‌’, కళ్ల దిగువన ‘డార్క్‌ సర్కిల్స్‌’ దగ్గర కాకుండా మిగతా ముఖం మీద పూసుకోవచ్చు.


ఐ లాషెస్‌: కనురెప్పలను కర్లర్‌తో తిప్పడం మూలంగా కనురెప్పలు చిక్కగా మారి, ముఖం మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది. అయితే మెరుపులతో కూడిన ఐ మేకప్‌ వేసుకోకూడదు. ఐ షాడో ప్రైమర్‌ లేదా పల్చని కన్‌సీలర్‌ లేయర్‌ అద్దుకోవాలి. అలాగే లిక్విడ్‌ ఐలైనర్లకు బదులుగా ఐ లైనర్‌ పెన్సిల్‌ వాడుకోవాలి.


లిప్‌స్టిక్‌: లిప్‌ ప్రైమర్‌ వేసుకుంటే పెదవులు నునుపుగా, లిప్‌స్టిక్‌ వేసుకోడానికి అనువుగా మారతాయి. అలాగే లిప్‌లైనర్‌,  లిప్‌స్టిక్‌ దగ్గరి రంగుల్లో ఉండేలా చూసుకోవాలి. లైనర్‌తో పెదవులను అందమైన ఆకారంలో దిద్దుకున్న తర్వాత, లైనర్‌ లోపల లిప్‌స్టిక్‌ నింపాలి.

Updated Date - 2022-05-15T06:12:18+05:30 IST