పరికరం.. ఏదీ కనికరం?

ABN , First Publish Date - 2020-10-31T06:38:54+05:30 IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి తుప్పుపట్టింది

పరికరం.. ఏదీ కనికరం?

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి తుప్పు

మూడేళ్లుగా మంజూరుకాని నిధులు

ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు రైతులకు అందని ద్రాక్షే

హార్వెస్టర్లు లేక ఆలస్యం కానున్న వరికోతలు


ఖమ్మం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి తుప్పుపట్టింది. మూడేళ్లుగా నిధులురాక రైతులకు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, ఇతర వ్యవసాయ పరికరాలు పంపిణీ చేయడంలేదు. ఉమ్మడి రాష్ట్రంలో యంత్రలక్ష్మి పథకంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ పథకంగా అమలుచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేసే కృషివికాస్‌యోజన పథకాన్ని దీనికి అనుసంధానం చేసి రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం రైతులకోసం కొనసాగిస్తున్నారు.  


నిధులు లేవు.. యూనిట్లు లేవు

ఏటా నిధుల కేటాయింపు జరిగితే సబ్సిడీపై రైతులు కోరుకున్న కంపెనీలకు చెందిన ట్రాక్టర్లతో పాటు ఇతర వ్యవసాయ పనిముట్లు 50శాతం సబ్సిడీపై అందించే సౌలభ్యం ఈపథకంలో ఉంది. రైతు గ్రూపుల పేరుతో వ్యవసాయ పనిముట్లు తీసుకుంటే 90శాతం సబ్సిడీపొందే అవకాశం ఉంది. గరిష్ఠంగా రూ. 3.50లక్షల వరకు ఈపథకం కింద రైతులు లబ్ధిపొందే  అవకాశం ఉంది కలుగుతుంది. రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే వ్యవసాయ యాంత్రీకరణ పథకం పలు అధునాతన సాగుపద్ధతులుకు శ్రీకారంచుడుతున్నా గడిచిన మూడేళ్లుగా నిధులు లేక జిల్లాల్ల్లో ఒక్క యూనిట్‌ మంజూరుకాలేదు. 


పరికరాల పంపిణీకి బ్రేక్‌

 ఖమ్మం జిల్లాలో 2017 వ్యవసాయ సీజన్‌లో రూ.24కోట్లు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద మంజూరుకాగా సుమారు 700వరకు ట్రాక్టర్లు హార్వెస్టుర్లు, వరినాటే యంత్రాలు, ఇలా పలురకాల విలువైన వ్యవసాయ యంత్రాలను రైతులకు అందించారు. అంతకుముందు కూడా దశలవారీగా ఏటా ఎంతో కొంత వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద నిధులు కేటాయింపు జరిగింది.  అప్పుడు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, దుక్కులు దున్నే పరికరాలు, తైవాన్‌ స్పేయర్లతోపాటు రైతులకు ఉపయోగపడే పరికరాలను సబ్సిడీపై అందించారు. దీంతో గ్రామాల్లో ఈపథకానికి భారీగా డిమాండ్‌ పెరిగింది. మొదట్లో మండలానికి ఒకటి ఉన్న ట్రాక్టర్‌ ఆతర్వాత పంచాయతి స్థాయికి విస్తరించింది. దీంతో ఏటా రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కోసం ఆశగా ఎదుచుచూస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు నిధుల  కేటాయింపులేదు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంది. దీంతో ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీకి బ్రేకులు పడ్డాయి. 


హార్వెస్టర్లు లేక కోతలు ఆలస్యం..

నిధులు లేక వ్యవసాయశాఖ రైతులనుంచి దరఖాస్తులు కూడా స్వీకరించడంలేదు. నిధులు వస్తేనే దరఖాస్తులు తీసుకుంటామని రైతులకు  వ్యవసాయశాఖ సూచిస్తోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోను వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి నిధులు లేక నీరసడుతోంది. కూలీల కొరత, పెరిగిపోతున్న సాగుపెట్టుబడులు, దుక్కిటెడ్లు లేక దుక్కులు దున్నే అవకాశం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో వేసవి దుక్కులనుంచి పైపాట్లు వరకు ట్రాక్టర్లపైనే రైతులు ఆధారపడుతున్నారు. వరినాట్లు, కోతలకు వరినాటే యంత్రం, హార్వెస్టర్లు పైనే ఆధారపడి సాగుచేస్తున్నారు. ఇప్పుడు అరకొర ఉన్న యంత్రాలతో సీజన్‌లోరైతులు హార్వెస్టర్లులేక వరికోతలు వేగంగా చేయలేకపోతున్నారు.


దీంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి హార్వెస్టర్లను జిల్లాకు రప్పించి అధిక ధరలకు రైతులు వరికోతలు కోసే పరిస్థితి నెలకొంటుంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాత్రీకరణ పథకానికి నిధులు కేటాయిస్తే వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు వరినాటు యంత్రాలు సంఖ్య పెరిగి రైతుల పంటలసాగు సజావుగా సాగనుంది. రైతుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈపథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2020-10-31T06:38:54+05:30 IST