ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రను సక్సెస్‌ చేయండి

ABN , First Publish Date - 2022-09-29T06:00:25+05:30 IST

విశాఖ సాగరతీరంలో అక్టోబరు రెండున చేపట్టనునన్న ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రలో వేలాది మంది కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు.

ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రను సక్సెస్‌ చేయండి
దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి రాజశేఖర్‌

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ 

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 28: విశాఖ సాగరతీరంలో అక్టోబరు రెండున చేపట్టనునన్న ఉక్కు సత్యాగ్రహ పాదయాత్రలో వేలాది మంది కార్మికులు తమ కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 594 రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్‌ను అటకెక్కించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను సొంత గనులు కేటాయించకుండా నష్టాల సాకును చూపి ప్రైవేటీకరణకు కేంద్రం పాల్పడుతుండడం దారుణమన్నారు.  నాయకుడు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలోని ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి హామీలను విస్మరించిన కేంద్రం ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియతో కార్మికులతో నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే వుంచాలని డిమాండ్‌ చేశారు. నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ సార్వభౌమత్వాన్ని ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కేంద్రానికి ప్రభుత్వాలకు తగిన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ పీఎం మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించాలనుకోవడం శోచనీయమన్నారు. ఉపాధులను హరించే విధానాలను రూపొందిస్తున్న ప్రభుత్వాలను కూలదోయాలన్నారు. కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు మాట్లాడుతూ వివిధ పన్నుల రూపంలో ప్రజలపై భారం మోపి, నిత్యావసర సరకులు ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ రేట్లను కేంద్రం పెంచి ప్రజలు జీవన విధానాలను అతలాకుతలం చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాలకు చరమగీతం పాడాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేఎస్‌ఎన్‌ రావు, మస్తానప్ప, నీరుకొండ రామచంద్రరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, నమ్మి సింహాద్రి, వైటీ దాస్‌, తదితరులు పాల్గొన్నారు.


ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర పోస్టర్‌ ఆవిష్కరణ

ఉక్కుటౌన్‌షిప్‌: స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎంతటి త్యాగాలకైన తాము సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్‌ డి.ఆదినారాయణ పేర్కొన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించరాదంటూ వచ్చే నెల రెండున సాగరతీరంలో తలపెట్టనున్న ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర పోస్టర్‌ను బుధవారం ప్లాంట్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికే తలమానికమైన స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేటీకరణ చేయాలనుకోవడం దారుణమన్నారు. ప్రాణ త్యాగాలనై పాల్పడైనా ప్లాంట్‌ను కాపాడుకుంటామన్నారు. ఈ పాదయాత్రలో కార్మిక వర్గంతో పాటు కాంట్రాక్టు కార్మికులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు జె.అయోధ్యరాం, నీరుకొండ రామచంద్రరావు, వై.మస్తానప్ప, మసేన్‌రావు, నరసింగరావు, రామ్మెహన్‌కుమార్‌, బొడ్డు పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-29T06:00:25+05:30 IST