ఇంజనీరింగ్‌ ఫీజు 3.2 లక్షలు చేయండి

ABN , First Publish Date - 2022-05-11T08:05:34+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ఠంగా రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.34 లక్షల దాకా ఉన్న ఇంజనీరింగ్‌ ఫీజులను గణనీయంగా పెంచాలని కాలేజీలు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎ్‌ఫఆర్‌సీ)ని కోరాయి.

ఇంజనీరింగ్‌ ఫీజు 3.2  లక్షలు చేయండి

  • ‘ఫీ రెగ్యులేటరీ కమిటీ’కి ప్రధాన కాలేజీల వినతి
  • రూ.2 లక్షలు చేయాలని కోరిన మధ్యస్థ కాలేజీలు
  • రూ.లక్ష పెంపు కోరుతున్న కనిష్ఠ ఫీజు కళాశాలలు
  • గత మూడేళ్ల వ్యయం ఆధారంగానే ఫీజుల పెంపు
  • కాలేజీలవారీగా ఆదాయవ్యయాల పరిశీలన షురూ
  • అనంతరం ప్రభుత్వానికి ఫీ రెగ్యులేటరీ కమిటీ నివేదిక
  • కౌన్సెలింగ్‌ నాటికి ఫీజుల ఖరారుపై నిర్ణయం


ఇంజనీరింగ్‌ ఫీజులను భారీగా పెంచాలంటూ కళాశాలలు తెలంగాణ ‘అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ’కి విజ్ఞప్తి చేశాయి! పేరొందిన పెద్ద కళాశాలలు భారీగా రూ.2 లక్షల దాకా పెంపు కోరగా.. తక్కువ ఫీజులు వసూలు చేసే కాలేజీలు సైతం రూ. లక్ష పెంపు కోరాయి! కనీసం ఇప్పుడున్న ఫీజులను 50 శాతం మేర అయినా పెంచాలని పలు కాలేజీలు కోరాయి. అయితే.. కమిటీ మాత్రం ఆయా కాలేజీల గత మూడేళ్ల ఖర్చుల ఆధారంగానే ఫీజుల పెంపుపై నిర్ణయం తీసుకోనుంది.


హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ఠంగా రూ.30 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.34 లక్షల దాకా ఉన్న ఇంజనీరింగ్‌ ఫీజులను గణనీయంగా పెంచాలని కాలేజీలు తెలంగాణ అడ్మిషన్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ(టీఏఎఫ్‌ఆర్‌సీ)ని కోరాయి. ప్రస్తుతం కనిష్ఠ ఫీజులతో కొనసాగుతున్న కాలేజీలు  లక్ష వరకూ ఫీజును పెంచాలని కోరగా.. మధ్యస్థ ఫీజుల కాలేజీలు రూ.2 లక్షల ఫీజు కావాలని కోరాయి. ప్రధాన కాలేజీలు మాత్రం ఫీజును రూ.3.20 లక్షల దాకా పెంచాలని కోరుతున్నాయి. గత రెండేళ్లగా నెలకొన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొంత వెసులుబాటును కల్పించాలని ఆయా కాలేజీలు కోరుతున్నాయి. అయితే, గత మూడేళ్ల కాలంలో కాలేజీలు చేసిన వ్యయాన్ని అంచనా వేసి, వచ్చే మూడేళ్లల్లో వసూలు చేసే ఇంజనీరింగ్‌ ఫీజులను ఖరారు చేయాలని టీఏఎ్‌ఫఆర్‌సీ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కాలేజీలకు సంబంధించిన ఆడిట్‌ లెక్కలను అధికారులు పరిశీలిస్తున్నారు. కాలేజీల వారీగా ప్రతినిధులను పిలిపించి.. ఆదాయవ్యయాలపై  వివరాలు తెలుసుకుంటున్నారు. 


వృత్తి విద్య కోర్సులకు సంబంధించి గతంలో పెంచిన ఫీజుల అమలు గడువు ఇటీవలే ముగిసింది. వచ్చే మూడేళ్ల కాలానికి సంబంధించి (2022-23 నుంచి 2024-25 వరకూ) ఇంజనీరింగ్‌తో పాటు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బి.ఎడ్‌. వంటి అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకూ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే మొదటి దశలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలకు సంబంధించిన ఫీజులను ఖరారు చేయాలని ఏఎ్‌ఫఆర్‌సీ నిర్ణయించింది.


ఈమేరకు నోటిఫికేషన్‌ జారీ చేసి ఆయా కాలేజీల నుంచి ప్రతిపాదనలను కూడా తీసుకుంది. ప్రస్తుత ఫీజులను  కనీసం 50 శాతం మేర అయినా పెంచాల్సిందిగా ఆయా కాలేజీలు ఏఎ్‌ఫఆర్‌సీకి ప్రతిపాదనలను సమర్పించినట్టు తెలిసింది. అయితే, కళాశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలు, ల్యాబ్‌, లైబ్రరీ వంటి ఇతర సదుపాయాలు, టీచింగ్‌, నాన్‌-టీచింగ్‌ సిబ్బందికి ఇచ్చే వేతనాలతోపాటు, కాలేజీకి వచ్చే ఆదాయం, నిర్వహణకు అయ్యే వ్యయం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఫీజులను ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో, ఆయా కాలేజీలు తమ ఆదాయం, వ్యయంతో పాటు సిబ్బందికి చెల్లిస్తున్న జీత భత్యాల అడిట్‌ వివరాలను ఏఎ్‌ఫఆర్‌సీకి సమర్పించాయి. వాటిని ప్రస్తుతం ఏఎ్‌ఫఆర్‌సీ ఆడిటర్లు పరిశీలిస్తున్నారు. కాలేజీలు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత ఏయే కాలేజీ ఫీజు ఎంత మేర పెంచాలనే విషయాన్ని నిర్ణయిస్తూ ప్రభుత్వానికి ఏఎ్‌ఫఆర్‌సీ ప్రత్యేక నివేదికను సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. అప్పుడు కొత్త ఫీజులు అమలులోకి వస్తాయి. ఇంజనీరింగ్‌ సీట్ల కౌన్సెలింగ్‌ నాటికి కొత్త ఫీజుల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.

Read more