అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటా!

ABN , First Publish Date - 2020-10-01T05:30:00+05:30 IST

చిన్నప్పటి నుంచి కోర్టు హాలు, న్యాయవాదుల కథలు వింటూ పెరిగిన ఆమె పెద్దయ్యాక న్యాయవిద్య అభ్యసించి, నల్లకోటు ధరించాలనుకుంది. డిగ్రీ పట్టా అందుకోవడమే కాదు ఏకంగా 18 బంగారు పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది 24 ఏళ్ల యమునా మీనన్‌...

అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటా!

చిన్నప్పటి నుంచి కోర్టు హాలు, న్యాయవాదుల కథలు వింటూ పెరిగిన ఆమె పెద్దయ్యాక న్యాయవిద్య అభ్యసించి, నల్లకోటు ధరించాలనుకుంది. డిగ్రీ పట్టా అందుకోవడమే కాదు ఏకంగా 18 బంగారు పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది 24 ఏళ్ల యమునా మీనన్‌. న్యాయశాస్త్రంలో ఉన్నత చదువుల కోసం ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లనున్న ఆమె విశేషాలివి...


అది బెంగళూరులోని ‘నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ’ ప్రాంగణం. అక్కడ 28వ స్నాతకోత్సవం వేడుకగా జరుగుతోంది. ఈ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఒక్కొక్కరి పేర్లు చదువుతూ, వారికి వర్చ్యువల్‌గా బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నారు. అయితే ఈ ఏడాది బీఏ ఎల్‌ఎల్‌బీ హానర్స్‌ డిగ్రీ పూర్తి చేసిన యమునా మీనన్‌ పేరు ఒక్కసారి కాదు పద్దెనిమిది సార్లు పిలిచారు. మొదటి ర్యాంక్‌తో పాటు ఉత్తమ ప్రతిభ చూపినందుకు, అవుట్‌ స్టాండింగ్‌ గ్రాడ్యుయేటింగ్‌ స్టూడెంట్‌, ఓవరాల్‌ టాపర్‌, బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ ఫీమేల్‌ స్టూడెంట్‌ ఇతరాలు కలిపి... మొత్తం 18 గోల్డ్‌ మెడల్స్‌ యుమున సొంతం చేసుకుంది. యమున ప్రతిభాపాటవాలు తెలుసుకొన్న పలు కార్పొరేట్‌ కాలేజీలు ఆమెకు మాస్టర్‌ సీటు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ‘‘నాకు రెండు అంతర్జాతీయ యూనివర్సిటీల నుంచి స్కాలర్‌షిప్‌ ఆఫర్‌ వచ్చింది. ఆక్స్‌ఫర్ట్‌ లా యూనివర్సిటీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీ అనుబంధ కాలేజీ ట్రినిటీ నాకు స్కాలర్‌షిప్‌ ఆఫర్‌ చేశాయి. నేను ట్రినిటీ కాలేజీలో మాస్టర్స్‌ చదవాలని నిర్ణయించుకున్నా. కోర్స్‌ సమయంలో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నా’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతుంది యమున. ఆమె కలను సాకారం చేయడంలో తల్లితండ్రులు పూర్తి సహకారం అందించారు. 


వేసవి సెలవులు జీవిత లక్ష్యాన్ని చూపాయి

యమున తల్లితండ్రులది కేరళ ఎర్నాకుళం జిల్లాలోని థ్రిప్పునుథురా. వారిది మధ్యతరగతి కుటుంబం. ‘‘అవి నేనే పదోతరగతి పరీక్షలు రాసి, వేసవి సెలవులు సరదాగా గడుతున్న రోజులు. మా పొరుగింటిలో సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేసి రిటైర్‌ అయిన ఇ.ఎక్స్‌. జోసెఫ్‌ ఉండేవారు. ఆయన కొన్ని పద్యాలతో ఒక పుస్తకం రాస్తున్నారు. నేను ఆయనకు కంప్యూటర్‌ పనిలో సాయం చేసేదాన్ని. ఆయన నాకు న్యాయవాదుల జీవితం, వారు కోర్టులో వాదించే తీరు, కేసులు గెలిపించే విధానం గురించి చెబుతూ ఉండేవారు. నేనూ ఆసక్తిగా వినేదాన్ని’’ అని తనకు న్యాయవిద్య మీద ఇష్టం ఎలా పెరిగిందో వివరిస్తుంది యమున. అయితే న్యాయవాది అవ్వాలనే తన కలను నిజం చేసుకోవాలనే క్రమంలో యమున కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌లో మొదటి ప్రయత్నం (2014)లో విఫలమైంది. అయినా ఆమె కుంగిపోలేదు. న్యాయ విద్య అభ్యసించాలనుకొనే పేద విద్యార్థులకు సాయం చేసే ఇంక్రీస్‌ డైవర్సిటీ బై ఇంక్రీసింగ్‌ యాక్సెస్‌ (ఐడీఐఏ) నడిపే సంస్థలో శిక్షణ పొంది మెలకువలు నేర్చుకుంది. ఆ మరుసటి ఏడాది క్యాట్‌లో 28వ ర్యాంకు సాధించింది యమున. దాంతో ఆమెకు బెంగళూరులోని ‘నేషనల్‌ లా స్కూల్‌ ఫర్‌ ఇండియా యూనివర్సిటీ’లో బీఏ ఎల్‌ఎల్‌బీ హానర్స్‌లో సీటు వచ్చింది. ప్రతిభతో పాటు కష్టపడేతత్వాన్ని నమ్ముకొని విజయం సాధించిన యమునను మెచ్చుకుంటూ సోషల్‌మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


‘‘టాపర్‌ అవుతానని నాకు ముందే తెలుసు. అయితే 18 గోల్డ్‌ మెడల్స్‌ రావడం, మా కాలేజీ చరిత్రలో ఆ ఘనత సాధించిన మొదటి వ్యక్తిని నేనే కావడం నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది’’ 

Updated Date - 2020-10-01T05:30:00+05:30 IST