వైట్‌హౌస్‌లో కీలక పదవికి భారతీయ సంతతి అధికారి రాజీనామా..!

ABN , First Publish Date - 2022-01-23T01:59:28+05:30 IST

శ్వేత సౌధంలోని కీలక విభాగం మిలిటరీ ఆఫీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి మజూ వర్ఘీస్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు.

వైట్‌హౌస్‌లో కీలక పదవికి భారతీయ సంతతి అధికారి రాజీనామా..!

వాషింగ్టన్: శ్వేత సౌధంలోని కీలక విభాగం మిలిటరీ ఆఫీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న భారత సంతతి వ్యక్తి మజూ వర్ఘీస్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. శనివారం పలు ట్వీట్ల ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. శ్వేత సౌధంలో రెండున్నరేళ్ల తన ప్రయాణం ముగుస్తోందన్న ఆయన తనను ఎన్నో భావోద్వేగాలు చుట్టుముడుతున్నాయని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి కోసం పని చేసే అవకాశం లభించినందుకు తనకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. 


అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా హయాంలోనూ పలు బాధ్యతలు నిర్వహించిన వర్ఘీస్.. బైడెన్ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. అయితే.. రాజీనామా తరువాత తన ప్రయాణం ఏంటనేదానిపై వర్ఘీస్ ఎటువంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఇక వైట్ హౌస్ కూడా వర్ఘీస్ స్థానంలో ఎవరిని నియమిస్తారనే అంశంలో మౌనాన్నే ఆశ్రయించింది. వైట్ హౌస్ మిలిటరీ ఆఫీస్‌ చీఫ్‌గా వర్ఘీస్ అధ్యక్షుడి పర్యటనలు, ఇతర కార్యక్రమాలకు తోడ్పాటునందించే త్రివిధ దళాల బృందాలను సమన్వయపరిచే బాధ్యతలు నిర్వర్తించేవారు.

Updated Date - 2022-01-23T01:59:28+05:30 IST