ప్రతి ముగ్గురిలో ఇద్దరు రుణ గ్రహీతలకు ఆ విషయమే తెలియదట!

ABN , First Publish Date - 2020-12-04T00:35:26+05:30 IST

దేశంలోని ప్రతి ముగ్గురు రుణ గ్రహీతల్లో ఇద్దరికి సిబిల్ స్కోర్ గురించి తెలియదట! మంచి సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ...

ప్రతి ముగ్గురిలో ఇద్దరు రుణ గ్రహీతలకు ఆ విషయమే తెలియదట!

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ముగ్గురు రుణ గ్రహీతల్లో ఇద్దరికి సిబిల్ స్కోర్ గురించి ఏమాత్రం అవకాహన లేదని వెలుగులోకి వచ్చింది. మంచి సిబిల్ స్కోర్ ఉన్నప్పటికీ... రుణాలు పొందేందుకు అత్యంత కీలకమైన సిబిల్ స్కోర్ గురించి వారికి తెలియదని ఓ అధ్యయనం వెల్లడించింది. రుణ గ్రహీతలు రుణాలు పొందే అర్హతను నిర్ణయించేందుకు సిబిల్ స్కోర్‌ని ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే హోం క్రెడిట్ ఇండియా అనే సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో... 52 శాతం మంది రుణగ్రహీతలకు సిబిల్ స్కోర్ ప్రాముఖ్యత గురించి తెలియదని తేలింది. ‘‘ 68 శాతం మంది అసలు తమ సిబిల్ స్కోర్ ఎంత ఉందో కూడా తెలియదని చెప్పారు. వీరంతా రుణాలు తీసుకున్నప్పటికీ... సిబిల్ స్కోర్ గురించి తెలియక పోవడం మరో విశేషం..’’ అని సదరు నివేదిక పేర్కొంది. పాట్నాలో 22 శాతం మంది తమ సిబిల్ స్కోర్ గురించి అవగాహనతో ఉండగా.. కోల్‌కతాలో 25 శాతం, ముంబైలో 25 శాతం మందిు  మాత్రమే తమ సిబిల్ స్కోర్ ఎంత ఉందో తెలుసునని చెప్పారు.


కాగా రుణాలు తీసుకుంటున్న వారిలో 76 శాతం మందికి తమ రుణాలపై ఎంత వడ్డీ చెల్లిస్తున్నారో కూడా తెలియదని హోం క్రెడిట్ ఇండియా వెల్లడించింది. వీరంతా నెలవారీ చెల్లిస్తున్న ఈఎంఐ మొత్తాల గురించి మాత్రమే తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారనీ.. విడిగా వడ్డీ మొత్తం గురించి వీరికి తెలియదని అధ్యయనం తెలిపింది. ఢిల్లీలో కేవలం 17 శాతం మంది రుణగ్రహీతలు తాము ఎంత వడ్డీ కడుతున్నామో చెప్పగా.. జైపూర్‌లో 19 శాతం మంది, ముంబైలో 24 శాతం మందికి మాత్రమే వడ్డీ ఎంతో తెలుసునని చెప్పారు. ‘‘ఏ దేశ ఆర్థిక ప్రగతికైనా ఆర్థిక అక్షరాస్యత చాలా ముఖ్యం. మా వినియోగదారులకు ఎంతమేర ఆర్థిక అక్షరాస్యత ఉందో తెలుసునేందుకే ఈ అధ్యయనం చేశాం..’’ అని హోం క్రెడిట్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మార్కో కేరవిక్ పేర్కొన్నారు. 


Updated Date - 2020-12-04T00:35:26+05:30 IST