Apr 12 2021 @ 16:26PM

మేజర్‌ మూవీ టీజర్‌ విడుదల

26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'మేజర్'. శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మకథను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించిగా.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌గా యంగ్‌ హీరో అడవి శేష్‌ నటించాడు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు జిఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. జూలై 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను ఏప్రిల్‌ 12న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు ముగ్గురు సూపర్‌ స్టార్స్‌ విడుదల చేశారు. తెలుగులో సూపర్‌స్టార్‌ మహేశ్‌, హిందీలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్, మలయాళంలో అగ్ర హీరో పృథ్వీరాజ్‌ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. టీజర్‌ ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. సినిమా కోసం వెయిట్‌ చేసేలా చేస్తోంది.