Abn logo
Feb 28 2021 @ 21:50PM

మార్చి 1 నుంచి దైనందిన జీవితంలో జరిగే మార్పులు ఇవే.. మీరు సిద్ధమా?

న్యూఢిల్లీ: దైనందిన జీవితంలో సోమవారం (మార్చి 1) నుంచి కొన్ని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఎల్‌పీజీ సిలిండర్, పెట్రో ధరలు, ఎస్‌బీఐ ఖాతాదారులకు కేవైసీ తప్పనిసరి వంటివి ఇందులో ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్న ఇంధన ధరలు పెరగడం నిత్యకృత్యం కాగా, 1వ తేదీ నుంచి జీవితంలో జరిగే మార్పులేంటో చూద్దాం.


ప్రతి నెల తొలి రోజున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు) గ్యాస్ సిలిండర్ కొత్త ధరలు ప్రకటిస్తాయి. ఫిబ్రవరిలో ఇప్పటికే మూడుసార్లు గ్యాస్ ధరలు పెరిగాయి. 14.2 కేజీ సిలిండర్ ధర దేశ రాజధానిలో రూ. 794గా ఉంది. కోల్‌కతాలో రూ. 745.50, చెన్నైలో రూ.735గా ఉంది. 

ఇంధన ధరలు 

పెట్రో ధరలను రోజువారీ సవరిస్తున్నప్పటికీ ఇటీవల చమురు ధరలు పెరగడంతో దేశంలో ధరలు ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. శీతాకాలంలో ధరలు దిగివస్తాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా పెర్కొన్నారు. చమురు ధరలు అంతర్జాతీయ విషయమని, డిమాండ్ కారణంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. శీతాకాలం నుంచి ధరలు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. 


ఎస్‌బీఐ ఖాతాదారులకు కేవైసీ

మార్చి 1 నుంచి భారతీయ స్టేట్‌బ్యాంక్ (ఎస్‌బీఐ) ఖాతాదారులకు కేవైసీ తప్పనిసరి. తమ ఖాతా యాక్టివ్‌గా ఉండాలనుకుంటే కనుక తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాల్సిందే. 


ఏటీఎంలలో రూ. 2 వేల నోటు 

ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలో సోమవారం నుంచి రూ. 2 వేల నోటు కనిపించదు. ఇకపై రూ. 2 వేల నోట్లను ఏటీఎంలో ఉంచరాదని బ్యాంకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే, బ్యాంక్ కౌంటర్లలో మాత్రం ఈ నోట్లు అందుబాటులో ఉంటాయి. ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకున్న ఖాతాదారులు వాటిని పెద్ద నోట్లుగా మార్చుకోవాలంటే బ్యాంకుకు రావాల్సిందేనని ఇండియన్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇకపై ఏటీఎంలలో రూ. 2 వేల నోటును లోడ్ చేయబోమని, తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని బ్యాంకు పేర్కొంది. 


ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మార్పు 

బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)లో విజయ బ్యాంక్, దేనాబ్యాంక్ విలీనం కావడంతో ఈ రెండు బ్యాంకుల ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మార్చి 1 నుంచి మారనుంది. అంటే, ఇకపై పాత ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌తో నగదు బదిలీ చేయలేమన్నమాట. మార్చి 31 నాటికి ఖాతాదారులకు ఎంఐసీఆర్ కోడ్‌తో వచ్చే కొత్త చెక్‌బుక్‌లను అందిస్తామని బ్యాంకు తెలిపింది. 1 ఏప్రిల్ 2019 నుంచే ఈ బ్యాంకుల విలీనం అమల్లోకి వచ్చింది. దీంతో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ ఖాతాదారులు ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులుగా మారిపోయారు.  పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా..

ఐఎఫ్ఎస్‌సీ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కూడా మార్పులు చేస్తోంది. పీఎన్‌బీ అనుబంధ బ్యాంకులైన ఓరియంటల్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాత చెక్‌బుక్‌లను, ఐఎఫ్ఎస్‌సీ (ఎంఐసీఆర్) కోడ్‌లను మారుస్తోంది. అయినప్పటికీ పాత కోడ్‌లు మార్చి 31 వరకు పనిచేస్తాయి. అయితే, కొత్త కోడ్‌లను మాత్రం ఖాతాదారులు త్వరగా తీసుకోవాలని బ్యాంకు సూచించింది. 


ఫాస్టాగ్ ఉంటేనే..

మార్చి 1 నుంచి వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి. వంద రూపాయల కనీస మొత్తంతో టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ను కొనుగోలు చేసుకోవచ్చని జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎన్‌హెచ్ఏఐ) తెలిపింది. ఫాస్టాగ్ లేని వాహనాలు భారీ మొత్తాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది.


స్పెషల్ రైళ్లు 

కరోనా లాక్‌డౌన్ నుంచి రెగ్యులర్ రైళ్లను పక్కన పెట్టేసిన భారతీయ రైల్వే ప్రస్తుతం కొన్ని రూట్లలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే, మార్చి 1 నుంచి మరిన్ని రైళ్లను పట్టాలెక్కిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రయాణికులకు బోల్డంత ఉపశమనం కలగనుంది. పలు రైళ్లు పట్టాలకెక్కబోతున్నాయి. వివిధ మార్గాల్లో 11 జతల రైళ్లు (22 రైళ్లు) నడపాలని పశ్చిమ రైల్వే నిర్ణయించింది. ఇందులో ఢిల్లీ, మధ్యప్రదేశ్, ముంబైలలోని పలు రూట్లు ఉన్నాయి. వీటిలో చాలావరకు రైళ్లు సోమవారం నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. 

Advertisement
Advertisement