23ఏళ్లు Oman లోనే భారత మహిళ.. ఇళ్లలో పనిచేస్తూ సొంతూరిలో..

ABN , First Publish Date - 2021-11-20T18:01:52+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 ఏళ్లు ఒమన్‌లోనే పని చేసిందామె. అక్కడి భారతీయుల ఇళ్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బులను కూడబెట్టి సొంతూరిలో చక్కని ఇల్లు నిర్మించుకుంది.

23ఏళ్లు Oman లోనే భారత మహిళ.. ఇళ్లలో పనిచేస్తూ సొంతూరిలో..

మస్కట్: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 23 ఏళ్లు ఒమన్‌లోనే పని చేసిందామె. అక్కడి భారతీయుల ఇళ్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బులను కూడబెట్టి సొంతూరిలో చక్కని ఇల్లు నిర్మించుకుంది. అలాగే కూతురిని చదివించి, పెళ్లి కూడా చేసింది. ఒకగానొక కూతురు కావడంతో పెళ్లిలో భారీగా కట్నకానుకలు ఇచ్చిమరీ ఆమె ఘనంగా అత్తారింటికి సాగనంపింది. చివరకు తమ బతుకుదెరువు కోసం భర్తతో సొంతంగా ఓ పౌల్ట్రీ ఫార్మ్ సైతం పెట్టించింది. ఇలా ఒమన్‌లో 23 ఏళ్లు కష్టపడి తన కుటుంబాన్ని మంచి స్థాయికి తెచ్చుకున్న కేరళకు చెందిన రాణి అశోకన్ ఎట్టకేలకు కేరళ రాష్ట్రంలోని తన సొంతూరు అయిన వదక్కంచెరీకి తిరిగి వస్తోంది. దేశం కాని దేశంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని మరీ నిలబడింది రాణి. తన కలలను నిజం చేసుకుని స్వదేశానికి సగర్వంగా తిరిగొస్తోంది. ఈ సందర్భంగా ఆమె తన 23 ఏళ్ల ఒమన్ జర్నీ గురించి మీడియాకు వివరించింది..


అది 1998.. ఎన్నో ఆశలతో రాణి అశోకన్ తన భర్తతో కలిసి ఒమన్‌లో అడుగు పెట్టింది. మొదట సలాలాహ్‌లోని భారతీయుల ఇళ్లలో పనిమనిషిగా చేసింది. అలా అక్కడ కొన్ని రోజులు పనిచేసిన తర్వాత మస్కట్ వెళ్లారు రాణి దంపతులు. అక్కడికెళ్లిన తర్వాత కొన్ని రోజులకు రాణికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కాళ్లు, చేతుల నొప్పులతో ఇళ్లలో పనిచేయలేపోయింది. దాంతో వంట మనిషిగా పని చూసుకుంది. ఆమె చేసే వెజ్, నాన్‌వెజ్ వంటలు అక్కడి మలయాళీలకు నచ్చడంతో రాణికి చేతి నిండా పని దొరికింది. పోటీపడి మరీ రాణిని వంట మనిషిగా పెట్టుకునే వారు అక్కడి భారతీయులు. అందరూ తన వంటలను ఎంతో మెచ్చుకునే వారని రాణి తెలిపింది. అంతే.. అప్పటి నుంచి స్వదేశానికి తిరిగొచ్చే వరకు దాదాపు 23 ఏళ్లు అదే పనిచేసింది. 


అలా పని చేయగా వచ్చిన డబ్బులను కూడబెట్టి సొంతూరులో అన్ని సౌకర్యాలతో కూడిన మంచి ఇంటిని నిర్మించుకుంది. ఒకగానొక కూతురిని బాగా చదివించింది. అనంతరం ఆమెకు ఘనంగా వివాహం చేసింది. పెళ్లి సమయంలో కూతురికి ఏకంగా రూ.15లక్షలకు పైగా విలువ చేసే 360 గ్రాముల బంగారు ఆభరణాలు చేయించింది. అలాగే అల్లుడికి భారీ కట్నం కూడా ఇచ్చింది. మధ్యలో భర్తను స్వదేశానికి పంపించి ఓ పౌల్ట్రీ ఫార్మ్‌ను తెరపించింది. ఇప్పుడు అదే వారికి జీవనాధారం. ఇక స్వదేశానికి వచ్చిన తర్వాత తనకు ఉన్న పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనేది తన ఆలోచనగా రాణి పేర్కొంది. అంతేగాక టాక్సీ బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తున్నట్లు ఆమె తెలిపింది.        


స్వదేశానికి వచ్చే ముందు కరోనా బారిన పడ్డ రాణి..

దాదాపు రెండు దశాబ్దాలు ఒమన్‌లోనే ఉండిపోయిన రాణి.. స్వదేశానికి తిరిగి రావాలని నిర్ణయించుకుంది. ప్రయాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలో ఆమె కరోనా బారిన పడింది. రెండు నెలల కింద ఆమెకు కరోనా సోకడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రంలో చేరింది. అక్కడ తనలాంటి వారితో కలిసి కొన్ని రోజులు ఉంది. ఆ తర్వాత నెగెటివ్ రావడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. మళ్లీ ఇప్పుడు స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 



Updated Date - 2021-11-20T18:01:52+05:30 IST