Dubai: యజమానురాలు హింసిస్తుందని.. పనిమనిషి చేసిన నిర్వాహకమిదీ!

ABN , First Publish Date - 2022-04-08T14:47:40+05:30 IST

యజమానురాలిపై చేతబడి చేసిందనే ఆరోపణలతో ఆమె ఇంట్లో పనిచేసే ఓ మహిళను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Dubai: యజమానురాలు హింసిస్తుందని.. పనిమనిషి చేసిన నిర్వాహకమిదీ!

దుబాయ్: యజమానురాలిపై చేతబడి చేసిందనే ఆరోపణలతో ఆమె ఇంట్లో పనిచేసే ఓ మహిళను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయస్థానంలో పేర్కొన్న వివరాల ప్రకారం.. గత కొన్నిరోజులుగా ఉన్నట్టుండి తాను మానసికంగా, శారీరకంగా ఏదో తెలియని బాధను అనుభవిస్తున్నట్లు దుబాయ్ మహిళ కోర్టుకు తెలిపింది. దీనికి కారణం తన వద్ద పనిచేసే ఆసియాకు చెందిన మహిళనే కారణమని చెప్పింది. ఆమె తనపై చేతబడి చేయడంతోనే ఇలా తనకు మానసిక, ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ఒకరోజు తాను బాత్‌రూం కోసం లేచిన సమయంలో అర్ధరాత్రివేళ పనిమనిషి గది నుంచి గట్టిగా ఏవో మంత్రాలు వినిపించాయని పేర్కొంది. ఆ తర్వాతి రోజు అనుమానంతో పనిమనిషి గదిని పరిశీలించగా రక్తంతో కూడిన ఓ చిన్న గుడ్డముక్క దొరికిందని, అలాగే ఆమె మొబైల్ ఫోన్‌లో భయంకరంగా ఉండే ఓ బొమ్మ ఫొటో కూడా ఉందని చెప్పుకొచ్చింది. 


దాంతో న్యాయస్థానం పనిమనిషిని విచారించింది. ఈ విచారణలో.. కొంతకాలంగా యజమానురాలు తనను మాటలతో హింసించడం తట్టుకోలేకపోయానని పనిమనిషి చెప్పింది. దాంతో యజమానురాలిని ఆమెకు తెలియకుండా ఏదైనా చేయాలనే ఆలోచనతో స్వదేశంలో తనకు తెలిసిన ఓ మంత్రగాడిని సంప్రదించినట్లు తెలిపింది. ఆయన తన వద్ద 200 దిర్హమ్స్(రూ.4,136) తీసుకుని వాట్సాప్‌లో ఓ భయంకరమైన బొమ్మ ఫొటోను పంపించాడని, దాన్ని తన మొబైల్‌లోనే ఉంచాలని సూచించినట్లు తెలిపింది. ఆ బొమ్మనే యజమానురాలి ప్రవర్తను మార్చివేస్తుందని ఆ మంత్రగాడు తనతో చెప్పినట్లు పనిమనిషి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కేసు దుబాయ్ కోర్టులో విచారణ దశలో ఉంది. కాగా, ఇలాంటి చర్య యూఏఈ ఫెడరల్ పీనల్ కోడ్ ప్రకారం శిక్షార్హం. అందుకే పనిమనిషికి కఠిన శిక్ష తప్పకపోవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.   

Updated Date - 2022-04-08T14:47:40+05:30 IST