ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి మహీంద్రా

ABN , First Publish Date - 2022-08-16T06:24:43+05:30 IST

దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కూడా ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఐదు..

ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి మహీంద్రా

రెండు బ్రాండ్‌నేమ్స్‌తో మొత్తం 

5 ఈ-ఎస్‌యూవీల ఆవిష్కరణ 

2024 డిసెంబరులో తొలి కారు విడుదల 


లండన్‌: దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కూడా ఎలక్ట్రిక్‌ కార్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ల కోసం ఐదు ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 2024 చివరికల్లా తొలి ఈ-కారును తొలుత దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. మొదటి నాలుగు మోడళ్లను 2024 -2026 మధ్యలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలోని ప్రముఖ ప్యాసింజర్‌ వాహన విక్రయ సంస్థల్లో ఒకటైన ఎం అండ్‌ ఎం ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ కార్ల మార్కెట్లో మాత్రం లేదు. కాకపోతే, ఎలక్ట్రిక్‌ ఆటోల విభాగంలో మాత్రం 70 శాతానికి పైగా మార్కెట్‌ వాటాతో నం.1గా కొనసాగుతోంది.  కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో పాటు ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుండటంతో ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు ఇదే సరైన సమయమని మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా అన్నారు. ఎం అండ్‌ ఎం తన ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలను రెండు బ్రాండ్ల కింద విడుదల చేయనుంది. ఒకటి తన ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ బ్రాండ్‌ ఎక్స్‌యూవీ. ఈ బ్రాండ్‌నేమ్‌తో రెండు (ఎక్స్‌యూవీ.ఈ8, ఎక్స్‌యూవీ.ఈ9) మోడళ్లను ప్రవేశపెట్టనుంది. కేవలం ఎలక్ట్రిక్‌ కార్ల కోసం కంపెనీ ఆవిష్కరించిన బీఈ బ్రాండ్‌నేమ్‌తో మూడు మోడళ్లను (బీఈ.05, బీఈ.07, బీఈ.09) అందుబాటులోకి తీసుకురానుంది. 


కంపెనీ తన ఎలక్ట్రిక్‌ వాహనాల అభివృద్ధి కోసం ‘మహీంద్రా అడ్వాన్స్‌డ్‌ డిజైన్‌ యూర్‌ప’ (ఎం.ఏ.డీ.ఈ) పేరుతో డిజైన్‌ సెంటర్‌ను బ్రిటన్‌లోని ఆక్స్‌ఫోర్డ్‌షైర్‌, బాన్‌బరీలో ఏర్పాటు చేసింది. యూకే అంతర్జాతీయ వాణిజ్య మంత్రి రణిల్‌ జయవర్దన, మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కలిసి సోమవారం ఈ సెంటర్‌ను ప్రారంభించారు. 

Updated Date - 2022-08-16T06:24:43+05:30 IST