మహిళలకు భయాంధ్ర!

ABN , First Publish Date - 2022-05-17T06:21:00+05:30 IST

రాష్ట్రంలో అబలలపై అఘాయిత్యాలు మానవతావాదుల గుండెలను పిండేస్తున్నాయి. మహిళలకు రక్షణ కరువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అపఖ్యాతి మూటకట్టుకొంటున్నది...

మహిళలకు భయాంధ్ర!

రాష్ట్రంలో అబలలపై అఘాయిత్యాలు మానవతావాదుల గుండెలను పిండేస్తున్నాయి. మహిళలకు రక్షణ కరువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అపఖ్యాతి మూటకట్టుకొంటున్నది. ఈ అకృత్యాలు ఆగేదెన్నడో అర్థం కావడం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని ఈ రోజుల్లో బతుకుతెరువు కోసం బయటికి వస్తున్న మహిళలపై మానవ మృగాలు విరుచుకుపడటం రోజురోజుకీ పెరిగిపోతుంది. కాలేజీకి వెళ్ళిన ఆడపిల్లలు, ఆఫీసులకు వెళ్ళిన మహిళలు, కూలిపనులను వెళ్ళిన పేద మహిళలు క్షేమంగా ఇంటికి వస్తారన్న నమ్మకం లేదు. గుడిలో, బడిలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, రైల్వే స్టేషన్లలో, చివరకు ఇంట్లో కూడా మహిళకు రక్షణ లేకుండా పోయింది. పసి నలుసుల నుంచి ముసలివారి వరకు ఎవరికీ భద్రత లేని భయానక వాతావరణం నెలకొన్నది. రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదా అన్న అనుమానం కలుగుతోంది. హత్యాచారాలు నిత్యకృత్యంగా మారినా అవి జరగటమే లేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం, అత్యాచారాలు అలా అనుకోకుండా జరుగుతుంటాయని, పిల్లల పెంపకంలో తల్లుల లోపం ఉందని మహిళా హోం మంత్రి వ్యాఖ్యానించటం యావత్ మహిళాలోకాన్ని, పౌరసమాజాన్ని నివ్వెరపరిచాయి. వరుస హత్యలు, హత్యాచారాలపై స్వయంగా మహిళా హోం మంత్రి ఈ తీరున స్పందించటం మహిళాలోకాన్ని అవమానించేలా ఉంది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను తల్లుల పెంపకంపై నెట్టి తప్పించుకొంటున్న పరిస్థితి!


మూడేళ్ళ జగన్‌రెడ్డి పాలనలో మహిళలపై 800కి పైగా అఘాయిత్యాలు, దాడులు జరిగాయంటే రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత అధ్వాన్న స్థితిలో ఉన్నదో కళ్ళకు కడుతోంది. బాధిత మహిళల సామాజిక స్థితిగతులను విశ్లేషిస్తే దాదాపు అందరూ దళితవర్గాలకు చెందిన మహిళలే. తన జాతికి చెందిన మహిళలు అన్యాయానికి, అవమానానికి గురవుతుంటే సిగ్గుపడవలసిన హోం మంత్రి కామాంధుల క్రూరత్వానికి బలైపోయిన వారి నైతికతను మరింత దెబ్బతీసే విధంగా ప్రకటనలు చెయ్యడం బాధ్యతారాహిత్యం. రాష్ట్రంలో అభివృద్ధి దేవుడెరుగు కానీ మానభంగ పర్వం పరుగులు తీస్తోంది. గంజాయి, మద్యం, మత్తు మందులు వీరవిహారం చేస్తున్నాయి. ఉద్యోగాలు లేవు. పనులులేవు. ఉత్పత్తి లేదు. యువత పెడదారి పడుతున్నది. ఆ మధ్య హైదారాబాదులో ‘దిశ’ ఘటన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి దారుణాలను జరగనివ్వనంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ సందర్భంగానే దిశ బిల్లు, దిశ పోలీసు స్టేషన్లు, దిశ వాహనాలు, దిశ యాప్‌లు అంటూ ప్రచార్భాటం చేశారు. ఆ దిశ బిల్లు నేటికీ చట్ట రూపం దాల్చలేదంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. బిల్లు చట్ట రూపం దాల్చకుండానే దిశ చట్టం చేసేశామని, దాని కింద శిక్షలు కూడా పడ్డాయని ఊదర గొట్టి మహిళలను మభ్యపెట్టారు.


ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి 2024 ఎన్నికల్లో 175సీట్లు ఎలా గెలవాలన్న వ్యూహంపై ఉన్నటువంటి శ్రద్ధ మహిళలు, దళిత గిరిజనులపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టడంపై లేదు. మంత్రులు కూడా తిరిగి ఎలా అధికారంలోకి రావాలన్నదానిపై ఆ పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు తప్ప, రాష్ట్రంలో మహిళలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పించే దిశగా ఏ చర్చా చేయలేదు. మూడేళ్లుగా ప్రభుత్వం ఏదో సాధించినట్లు గొప్పలు ప్రచారం చేసుకోవడానికి ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. కానీ మహిళలపై నిత్యకృత్యంగా మారిన అత్యాచారాలు, హత్యలు, దాడులు అరికట్టడానికి మాత్రం కఠిన చర్యలు తీసుకోరా? మహిళలపై అఘాయిత్యాలు ఎందుకు ఆపడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకపోగా మీరే చేశారని ప్రతిపక్షంపై ఎదురుదాడి చేస్తున్నారు. అత్యాచారాలు తెలుగుదేశం వాళ్ళే చేశారు అంటున్నారు. మరి అధికారంలో ఉన్నది మీరే కదా? దోషులు ఎవరైనా పట్టుకొని వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత మీకు లేదా? మీ తప్పిదాలకు ఇతరులను బాధ్యులు చెయ్యడం ఏమిటి? బాధితులను పరామర్శించడానికి వెళ్లిన వారిపై దాడులు చేస్తున్నారు. మహిళల రక్షణపై ప్రభుత్వం దృష్టిపెట్టని కారణంగా ఆంధ్రప్రదేశ్ మహిళలపై అత్యాచారాలకు అడ్డాగా మారి రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్ అయింది. ముఖ్యమంత్రి మాటి మాటికి నా అక్క చెల్లెమ్మలు అంటూ బులిపిస్తున్నారు. మరి ఆ అక్క చెల్లెమ్మలపై నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించాల్సిన బాధ్యత ఆయనకు లేదా?


ఉపాధ్యాయులు వారి హక్కుల కోసం, డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా చేపట్టిన ఆందోళన అణచివేయడానికి మాత్రం రాష్ట్రం మొత్తం పోలీసు యంత్రాంగాన్ని వినియోగించారు. అట్లాగే శాంతియుతంగా ప్రజా ఉద్యమాలు చేస్తున్న ప్రతిపక్షాలను అణచి వేయడంపైనా ఎంతో పట్టుదల చూపించారు. చివరకి అత్యాచార బాధితులను పరామర్శించటానికి కూడా ప్రతిపక్షం వెళ్లకుండా సమర్థంగా అడ్డుకుంటున్నారు. కానీ మహిళలు, దళితులు, గిరిజనుల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులను అరికట్టడంపై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. జగన్ ప్రభుత్వం ప్రజా ఉద్యమాల అణచివేతనే పోలీసుల బాధ్యతగా మార్చింది తప్ప, ప్రజలకు, మహిళలకు, దళితులకు, గిరిజనులకు రక్షణ కల్పించి, శాంతి భద్రతలను కాపాడే బాధ్యతను పోలీసులకు అప్పగించలేదు. ఆంధ్రప్రదేశ్‌‍లో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఎన్.సి.ఆర్.బి నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే భౌతిక దాడుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. అలాగే మహిళలపై జరుగుతున్న నేరాల్లో రెండవ స్థానంలో, పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపు ఘటనల్లో రెండవ స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాలకు సంబంధించి అతి తక్కువగా శిక్షలు పడుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ 5వ స్థానంలో ఉంది. 2019లో మహిళలపై అఘాయిత్యాలు 1892 నమోదు కాగా 2020లో 2,942కు కేసులు పెరిగినట్లు నమోదైంది. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మొదటి వరసలో ఉన్నది. గతంతో పోలిస్తే మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు ఏకంగా 49.04శాతం పెరిగినట్లు వెల్లడైంది. ఇంటా బయటా మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. ప్రజల రక్షణకు ఉపయోగించాల్సిన అధికారాన్ని, రాజకీయాన్ని తిరిగి అధికారం హస్తగతం చేసుకోవడానికే వాడుతున్న జగన్ పాలనలో నేరస్వామ్యం గజ్జె కట్టి ఆడుతుంది.


ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల రక్షణ మాటల్లో కాకుండా చేతల్లో చూపాలి. విజయవాడ, గుంటూరు, బాపట్ల, ఏలూరు, తిరుపతి, విజయనగరం, శ్రీ సత్యసాయి తదితర జిల్లాల్లో జరిగిన హత్య, అత్యాచార, దాడుల కేసులలో నిందితులను కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అత్యాచార కేసుల్లో దోషులుపై ఎలాంటి కనికరం చూపాల్సిన అవసరంలేదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ న్యాయవిచారణలో జరుగుతున్న జాప్యమే నిందితుల నెత్తిన పాలు పోస్తున్నది అన్నది నిష్టుర సత్యం. అత్యాచారానికి ఒడిగట్టినవాడిని సత్వరం చట్టబద్ధంగా శిక్షించి తీరాలి. అది మిగిలినవారి వెన్నులో వణుకు పుట్టించాలి. నేరం జరిగిన ఆరు నెలలలోపే కఠిన దండనలు అమలయ్యే విధంగా చూడటం మహిళలకు రక్షణను పెంచుతుంది.

వంగలపూడి అనిత

తెలుగు మహిళ అధ్యక్షురాలు

Updated Date - 2022-05-17T06:21:00+05:30 IST