సాయిధరమ్ తేజ్‌కు జరిగిన ప్రమాదం గురించి కొంతమంది అజ్ఞానంతో మాట్లాడుతున్నారని నిర్మాత మహేశ్ కోనేరు ట్వీట్ చేశారు. మోటర్ ఫీల్డ్ గురించి అవగాహన ఉన్న ఆయన ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విశ్లేషణ ఇచ్చారు. సాయిధరమ్ తేజ్‌కు జరిగిన ప్రమాదం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. పెద్ద వాహనాలు, వాటి డ్రైవింగ్ మీద ఏ అవగాహనా లేకుండా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లు కూడా జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు. తేజ్ అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్, కార్ నడిపే వ్యక్తి కాదు. ప్రమాదానికి సంబంధించిన వీడియో పరిశీలిస్తే రోడ్డుపై ఇసుక, చిన్నచిన్న రాళ్లు ఉండటం వల్ల సాయికి ముందు వెళ్లిన ఆటో, వాహనదారుడు తమ వాహనాలను స్లో చేశారు. అప్పుడే సాయితేజ్ కూడా తన బైక్‌ని స్లో చేసి.. ఇసుక, ముందు ఉన్న వాహనదారులను క్రాస్ చేసి ప్రయాణం కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే ఇసుక వల్ల బండి స్కిడ్ అయింది. ఎలాంటి రేసర్‌కైనా సర్వసాధారణంగా జరిగే ప్రమాదమిది. రహదారి సరిగ్గా లేనందున దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఆయన హెల్మెట్ ధరించే ఉన్నాడు. సాధారణ వేగంలోనే ఉన్నారు. నియమాలను ఆయన అతిక్రమించలేదు. విషయం పూర్తిగా తెలుపుకోకుండా మాట్లాడొద్దు. ఆయన కుటుంబ సభ్యుల ప్రైవసీని గౌరవిద్దాం. ప్రమాదాలు ఎవరికైనా జరగొచ్చు. దీనిని ఇంతటితో వదిలేయండి. అన్ని ప్రమాదాలకు అతివేగమే కారణం కాదు’ అని మహేశ్ ట్వీట్లో పేర్కొన్నారు.