Sep 23 2021 @ 13:22PM

మహేశ్ ‘దూకుడు’కు పదేళ్ళు..

సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో వచ్చి బాక్సాఫీస్‌ను షేక్ చేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ఒకటి 'దూకుడు'. నేటితో (సెప్టెంబర్ 23) ఈ చిత్రం వచ్చి పదేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా, హీరోయిన్‌గా సమంత.. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సోనూ సూద్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, నాజర్, సుమన్, సయాజీ షిండే, ప్రగతి, షఫీ, వెన్నెల కిశోర్, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ’14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్’ పతాకంపై నిర్మించారు.  

కాగా చిత్ర దర్శకుడు శ్రీను వైట్ల తాజాగా  మాట్లాడుతూ.. 'మహేశ్ బాబుతో తీసిన 'దూకుడు' చిత్రం నాకెంతో ప్రత్యేకం'..అని తెలిపారు. ఇక ఈ సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కామెడి. ఎన్నిసార్లు ఈ సినిమా బుల్లితెరపై వచ్చినా కూడా అభిమానులు, ప్రేక్షకులు అదే ఉత్సాహంతో 'దూకుడు' చిత్రాన్ని చూస్తుంటారు. అంతగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా వచ్చి పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 23వ తేదీ రాత్రి 9 గంటలకు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.తో పాటు పలు చోట్ల స్పెషల్ షో ప్రదర్శించనున్నారు.