ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మహేష్ రూ. 25లక్షల విరాళం

ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా.. అండగా మేమున్నామని నిలబడటానికి సినిమా ఇండస్ట్రీ ముందుంటుంది. ఇది అనేకమార్లు రుజువైంది. ఇప్పుడు మరోసారి సినిమా ఇండస్ట్రీ ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు ముందడుగు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను ఇటీవల వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరదలతో ఏపీలోని నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వరదల కారణంగా నష్టపోయిన వాళ్లకు సహాయం అందించేందుకు గీతా ఆర్ట్స్ తరఫున నిర్మాత అల్లు అరవింద్ 10 లక్షల రూపాయలు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షల రూపాయలు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 25 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లుగా తెలియజేశారు.


‘‘ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో వినాశకరమైన వరదల కారణంగా నష్టపోయిన వారికి సహాయం అందించే ప్రయత్నంలో నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు అందిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను..’’ అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.


Advertisement