అది మహీ గొప్పతనం

ABN , First Publish Date - 2020-04-08T09:11:22+05:30 IST

భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ.. సహచరులతో వ్యవహరించే తీరును బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు. అందరితో పాటే తానూ అనే అతడి సిద్ధాంతం అద్భుతమని చెప్పాడు. మామూలుగా సొంత గడ్డపై సిరీస్‌లు

అది మహీ గొప్పతనం

  • బిజినెస్‌ క్లాస్‌కు ఎప్పుడూ దూరమే
  • సునీల్‌ గవాస్కర్‌ ప్రశంస


న్యూఢిల్లీ: భారత జట్టు మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ.. సహచరులతో వ్యవహరించే తీరును బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు. అందరితో పాటే తానూ అనే అతడి సిద్ధాంతం అద్భుతమని చెప్పాడు. మామూలుగా సొంత గడ్డపై సిరీస్‌లు ఆడుతున్నప్పుడు ఉత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు బీసీసీఐ బిజినెస్‌ క్లాస్‌ను ఆఫర్‌ చేస్తుంటుంది. ఎందుకంటే దేశవాళీ విమానాల్లో ఈ తరహా టిక్కెట్లు పరిమితంగా ఉంటాయి. ఇక కెప్టెన్‌, మేనేజర్‌, కోచింగ్‌ సిబ్బందికి సహజంగానే ఈ సౌకర్యం ఉంటుంది. కానీ, ధోనీ తన కెప్టెన్సీ హయాంలో బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించేందుకు ఎక్కువగా ఇష్టపడేవాడు కాదని సన్నీ తెలిపాడు. ‘స్వదేశంలో అంతర్జాతీయ సిరీస్‌లు జరుగుతున్నప్పుడు ఇరు జట్ల ఆటగాళ్లు చార్టెడ్‌ ఫ్లైట్‌లో వెళుతుంటారు. అలాగే కెప్టెన్‌, కోచ్‌ సిబ్బంది కాకుండా మిగతా ఆటగాళ్లంతా ఎకానమీలో కూర్చోవాల్సి ఉంటుంది. కానీ క్రితం మ్యాచ్‌లో మెరుగ్గా ఆడిన వారికి బిజినెస్‌ క్లాస్‌లో ప్రయాణించే సౌకర్యం ఉంటుంది. దీంతో పాటు ఇదే విమానంలో టీవీకి చెందిన సాంకేతిక సిబ్బంది కూడా వస్తుంటారు. కానీ కెప్టెన్‌గా తనకున్న బిజినెస్‌ క్లాస్‌ సౌకర్యాన్ని ధోనీ ఉపయోగించుకునే వాడు కాదు. అతడెప్పుడూ టీవీకి చెందిన కెమెరామెన్‌, సౌండ్‌ ఇంజినీర్లతో కూర్చునేందుకు ఇష్టపడేవాడు’ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు.


కోహ్లీ కూడా అంతే..: ధోనీ సంప్రదాయాన్ని ప్రస్తుత సారథి కోహ్లీ కూడా అనుసరిస్తున్నట్టుంది. ఈ విషయాన్ని గతంలో ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ బయటపెట్టాడు. 2018లో భారత జట్టు ఆసీస్‌లో పర్యటించింది. ఈ సందర్భంలో అడిలైడ్‌ నుంచి పెర్త్‌కు వెళుతున్న విమానంలో కోహ్లీ, అతడి భార్య అనుష్క తమ బిజినెస్‌ క్లాస్‌ సీట్లను జట్టు పేసర్లకు ఆఫర్‌ చేశారని వాన్‌ గుర్తుచేశాడు.

Updated Date - 2020-04-08T09:11:22+05:30 IST