సార్లు.. పేషెంట్లు లేనందునే..

ABN , First Publish Date - 2022-06-03T09:37:28+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): అధ్యాపకులు.. పేషెంట్లు లేని కారణంగా మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలల అనుమతులను రద్దు

సార్లు.. పేషెంట్లు లేనందునే..

మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ల అనుమతులు రద్దు

వైద్య కళాశాలల అనుమతులపై..

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): అధ్యాపకులు.. పేషెంట్లు లేని కారణంగా మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ వైద్య కళాశాలల అనుమతులను రద్దు చేసినట్లు జాతీయ వైద్య కమిషన్‌(ఎంఎన్‌సీ) స్పష్టం చేసింది. అధ్యాపకులు, పేషెంట్లు లేకుండా వైద్యులను ఎలా తయారు చేస్తారని ప్రశ్నించింది. అందుకే.. 2021-22 విద్యా సంవత్సరంలో అనుమతులను రద్దు చేసినట్లు ఆయా కాలేజీల డీన్లకు రాసిన లేఖల్లో స్పష్టం చేసింది. మూడు వారాల క్రితం ఎంఎన్‌సీ రాసిన లేఖలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ లేఖల ప్రకారం.. మహావీర్‌ కాలేజీలో నిర్ణీత టీచింగ్‌ ఫ్యాకల్టీల్లో సగం కూడా అధ్యాపకులు లేరని స్పష్టం చేసింది. 66ు ట్యూటర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది. ఇక మహావీర్‌ ఆస్పత్రిలో బెడ్‌ ఆక్యుపెన్సీ రేషియో 9.38ు మాత్రమేనని పేర్కొంది. 450 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండాల్సిన చోట.. 344 మందికే ఆ ఏర్పాట్లు ఉన్నట్లు తమ క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించినట్లు వెల్లడించింది. ఆస్పత్రిలో సరిపడా ఆపరేషన్‌ థియేటర్లు, విద్యార్థుల శిక్షణకు ఉపయోగించాల్సిన అలా్ట్రసౌండ్‌ యంత్రాలు లేవని తెలిపింది. వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే ఆస్పత్రిలో కనీసం 650 పడకలు ఉండాలని, మహావీర్‌లో మాత్రం 542 మాత్రమే ఉన్నట్లు గుర్తుచేసింది.  అటు.. ఎంఎన్‌ఆర్‌ కాలేజీలోనూ టీచింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల్లో 60ు, ట్యూటర్‌ పోస్టుల్లో 23ు ఖాళీలు ఉన్నట్లు ఎంఎన్‌సీ పేర్కొంది. తాము మార్చి 30న ఎంఎన్‌ఆర్‌ కాలేజీని సందర్శిస్తే.. యాజమాన్యం ఏప్రిల్‌ 26న తమకు ఓ రిపోర్టును పంపిందని.. అందులో పాత తేదీల్లో రిక్రూట్‌మెంట్లు జరిపినట్లు పేర్కొన్నారని.. ఇది మోసపూరితమని ఎంఎన్‌సీ ఆ లేఖలో పేర్కొంది. తమ క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో 650 బెడ్లకు గాను.. 13 మంది పేషెంట్లే అడ్మిట్‌ అయ్యారని తెలిపింది. ఆ రోజంతా ఎమర్జెన్సీలో ముగ్గురే రోగులు ఉన్నారని వివరించింది. వైద్య విద్యార్థులకు హాస్టళ్లు.. శిక్షణకు ఆపరేషన్‌ థియేటర్లు లేవని పేర్కొంది. ఈ కారణాల వల్ల.. మహావీర్‌, ఎంఎన్‌ఆర్‌ కాలేజీల అనుమతిని రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. టీఆర్‌ఆర్‌ కాలేజీకి కూడా ఎంఎన్‌సీ లేఖ రాసినా.. అది ఇంకా బయటకు రాలేదు.

Updated Date - 2022-06-03T09:37:28+05:30 IST