Abn logo
Oct 1 2020 @ 00:17AM

గాంధీ విశ్వాసమూ మహాత్ముని హేతువూ

Kaakateeya

మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా


మతాన్ని, భగవంతుణ్ణి గాంధీ అర్థం చేసుకున్నంత ఆధునికంగా మరొకరు అర్థం చేసుకున్నట్లు కనిపించదు. మతాన్ని గాఢంగా విశ్వసించిన మహాత్ముడు మతప్రమేయం లేని లౌకిక రాజ్యాన్ని కోరుకున్నాడు. తన మతం పట్ల విశ్వాసం, ఇతర మతాల పట్లా హేతువు ప్రదర్శించడం వల్ల ఇది సాధ్యమైందనుకోవచ్చు. ఇతర మతాల్ని అధ్యయనం చేయడం, అభిమానించడం స్వమతాన్ని బలహీనపరచడం కాదని అది విస్తృతపరచుకోవడమేనని ఆయన భావించారు. తన ప్రయత్నమంతా ప్రతి మతస్థుణ్ణి తన మతాన్ని మరింత భక్తిశ్రద్ధలతో అనుసరించేటట్టు చెయ్యడమేనని గాంధీ అన్నారు.


రామజన్మభూమి వివాదం ముగిసి అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమైన నేపథ్యంలో ‘హే రాం’ అంటూ జీవితం చాలించిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల ముగింపులోకి వచ్చాం. ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న అయోధ్యలో కొలువు కానున్న రాముడు గాంధీ ఉచ్ఛరించిన రాముడు ఒక్కరేనా అన్నది. ఎప్పుడూ ఏ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్సుకత చూపని గాంధీ, తన ఇష్టదైవం రాముడు జన్మించాడని చెబుతున్న చోట నిర్మితమవుతున్న ఈ ఆలయానికైనా వచ్చేవారా అన్నది మరో ఊహాత్మక ప్రశ్న. 


రాజకీయ నాయకుల్లో మతాన్ని, భగవంతుణ్ణి గాంధీ అర్థం చేసుకున్నంత ఆధునికంగా మరొకరు అర్థం చేసుకున్నట్లు కనిపించదు. మతాన్ని గాఢంగా విశ్వసించిన మహాత్ముడు మతప్రమేయం లేని లౌకిక రాజ్యాన్ని కోరుకోవడంలో అది స్పష్టమవుతుంది. తన మతం పట్ల విశ్వాసం ఇతర మతాల పట్ల హేతువు ప్రదర్శించడం వల్ల ఇది సాధ్యమైందనుకోవచ్చు. మతం ప్రాతిపదికగా జరుగుతున్న దేశవిభజనను గాంధీ వ్యతిరేకించారు. మతం మార్పిడి పొందిన ఒక సమూహం మాతృసమూహం నుంచి వేరుపడి స్వతంత్ర దేశం కావాలని కోరుకోవడం చరిత్రలో ఎక్కడా లేదంటూ, మతం మారితే మనస్తత్వాలు మారతాయా అని గాంధీ ప్రశ్నించారు. ఇతర మతాల్ని అధ్యయనం చేయడం, అభిమానించడం స్వమతాన్ని బలహీనపరచడం కాదనీ అది విస్తృతపరచుకోవడమేననీ అంటూ, తన ప్రయత్నమంతా ప్రతి మతస్థుణ్ణి తన మతాన్ని మరింత భక్తి శ్రద్ధలతో అనుసరించేటట్టు చెయ్యడమేనని ఆయన అన్నారు.


మతాన్ని అర్థం చేసుకోవడంలో ఒక లౌకికత్వం ఉండాలి. మతం విశ్వాసం మీద ఆధారపడి నిర్మితమవుతుంది. ఆధారాల్లేనిది, రుజువుల్లేనిది విశ్వాసం. చెరసాలలో జన్మించిన కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకుని అర్ధరాత్రి బయల్దేరిన వసుదేవుడికి యమున నది దారి ఇచ్చిందంటే ఎట్లా ఇస్తుందని ప్రశ్నించకుండా అంగీకరించడమే విశ్వాసం. ఇజ్రాలేయులను ఈజిప్టుకు నడిపించిన మోజెస్‌కు ఎర్రసముద్రం దారి ఇవ్వడమూ అలాంటిదే. ఇందులో ఒకటి నిజం కావడం, మరొకటి కాకపోవడం ఉండదు. ఒకటి విశ్వసించిన వ్యక్తి రెండవదాన్ని విశ్వసిస్తేనే అతను ఒక మతస్థుడవుతాడు. అంటే ఒక మతస్థుడు వేరొక మత అస్తిత్వాన్ని కూడా విశ్వసిస్తేనే స్వమతస్థుడవుతాడన్నమాట. ఈ అంశాన్ని గాంధీ బాగా గుర్తించినట్టు కనిపిస్తుంది. హేతుబద్ధం కానివి మార్పుకు లొంగవు. వేరొకరి జోక్యాన్ని సహించవు. అందువల్ల మానసిక ఆవరణను దాటి రాజకీయ ఆర్థిక ఆవరణలోకి వచ్చే అర్హత వాటికి ఉండదు. ఇక్కడే మతం, రాజకీయం అనే రెండిటి మధ్య గాంధీ రేఖ గీయగలిగారు. మొదటిది వ్యక్తిగతం మానసికం అనీ, రెండవది సామూహికం సామాజికం అని గుర్తించారు.


ఒక మతాన్ని అనుసరించే వాళ్లందరూ తమకు ఒకే రాజకీయ, ఆర్థిక సామాజిక ప్రయోజనాలున్నాయని భావిస్తారు. మతతత్వానికి ఇదే పునాది. ఆ మతాన్ని అనుసరించడం ద్వారా ఆ ప్రయోజనాలను కాపాడుకోగలమని అనుకుంటారు. అంతేకాదు, ఆ ప్రయోజనాలు వేరొక మతం వారి ప్రయోజనాల కంటే భిన్నమైనవిగా కూడా భావిస్తారు. ఇంకా ముందుకు పోయి అవి పరస్పర వ్యతిరేకమైనవిగా సంఘర్షించేవిగా నిర్ణయించుకుంటారు. ఇది–మతతత్వ రాజకీయాల మీద విస్తృత పరిశోధన చేసిన ప్రొఫెసర్ బిపన్ చంద్ర విశ్లేషణ. రాజ్యాంగం ద్వారా పొందవలసిన ప్రాథమిక హక్కులు, పౌర స్వేచ్ఛ, ఆర్థిక ప్రగతి, సంక్షేమం వంటివి ఏ మతస్థులకైనా ఒకే విధంగా అవసరమవుతాయి. రాజ్యం ప్రధాన బాధ్యత వాటి పరికల్పన, పరిరక్షణ. మతాన్ని బట్టి వీటిల్లో కొన్నింటికి మినహాయింపు ఉండదు. మత పరంగా పొందే ఏ ప్రత్యేక ప్రయోజనం ఈ అవసరాల్లో ఏ ఒక్కదానికీ ప్రత్యామ్నాయం కాజాలదు. అందువల్ల మతం పేరిట అధికారంలోకి రావడం భావోద్వేగ పర్యవసానమే అవుతుంది కానీ ఆలోచనాత్మకం కాదు. మతం లక్ష్యం రాజ్యం కానప్పుడు మతాన్ని వక్రీకరిస్తేకానీ రాజ్యం చేజిక్కదు. ఫలితంగా మతమూ రాజ్యమూ రెండూ తప్పుదారి పడతాయి.

మతానికి కేంద్రబిందువైన దేవుడు, ఉన్నాడా లేడా అనే మౌలిక ప్రశ్నను నిగ్గుదేల్చడం అటుంచి ప్రజలు దేవుడనే భావనను విశ్వసిస్తారనే వాస్తవాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. దాన్ని విస్మరించి చేసే సరత్తంతా నేల విడచి చేసేదే! కాబట్టి మతానికి ఇస్తున్న వక్రీకరణకు విరుగుడు నివ్వాలి. ‘బిజెపి నా హిందు మతాన్ని అవమానిస్తోంది’ అని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం సోషియాలజీ ప్రొఫెసర్ అవిజిత్ పాథక్ వాపోతున్నారు. ‘ఆధ్యాత్మికంగా సంపద్వంతమైన సాగే గుణం ఉన్న హైందవానికి బిజెపి ఒక ప్రతివాదం (anti-thesis) అని చెప్పడానికి నేనే మాత్రం సందేహించను. అది హిందూమతాన్ని ద్వేషఖడ్గంగా దిగజార్చింది. దాని ఆధ్యాత్మిక దివ్యానుభవాన్ని చంపేసింది. మూకతత్వాన్ని ప్రేరేపించింది. ఆంతరిక అన్వేషణలోని కవితాత్మ స్థానంలో ‘శత్రువు’తో యుద్ధం వంటి పశుభావనల్ని ప్రవేశపెట్టింది....’ అని అంటూ విదేశీ ముస్లిం దాడుల గురించి, కశ్మీరీ ఉగ్రవాదుల గురించి, అనైతిక కమ్యూనిస్టుల గురించి, గాంధేయ పిరికిపందల గురించి ఎంతకాలం వింటాం? ఎంతకాలం ఇతరుల్ని ద్వేషించుకుంటూ మన మతాన్ని నిలబెట్టుకుంటాం? అని గాంధేయవాది అయిన పాథక్ ప్రశ్నించారు. 


ఇటీవల ఒక చోట దేవుడి రథం తగలబడిపోయింది. మరో చోట అమ్మవారి గుళ్లో వెండి సింహప్రతిమల్ని ఎవరో ఎత్తుకెళ్లిపోయారు. ఇటువంటి దైవాపచారాలు ఒక మిత్రపక్షం పాలనలో జరిగినపుడు యాదృచ్ఛిక ఘటనలుగా భావించి వదిలేసిన రాజకీయ పక్షాలు ఇప్పుడు భిన్నంగా ప్రతిస్పందిస్తున్నాయి. ఆ ఘటనలు సంభవించిన రాష్ట్ర ముఖ్యమంత్రి మతవిశ్వాసాలకు ముడిపెట్టి రాద్ధాంతం, రాజకీయం చేస్తున్నాయి. ఇది, రాజ్యాంగ లౌకిక విలువల పతనానికి పరాకాష్ట. మతాన్ని ఆత్మిక ధార్మిక ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మతత్వం (religiosity). మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం మతతత్వం (communalism). మతతత్వ రాజకీయాల్ని అనుసరించడం మతాన్ని అనుసరించడం కాదు. ఈ మౌలిక స్పృహ లేకపోతే ఉభయ భ్రష్టత్వం తప్పదు.


ఈ నేపథ్యంలో చూస్తే గాంధీ రాముడు బిజెపి ఆరాధించే రాముడు ఒకరు కాదనిపిస్తోంది. అనేక రామాయణాలు ఉన్నట్టు అనేక మంది రాముళ్లు ఉన్నట్టున్నారు. గాంధీ రాముడు నిషాదుడైన గుహుణ్ణి హత్తుకున్న రాముడు. శబరి ఎంగిలి తిన్న రాముడు. వానరులతో స్నేహం చేసిన రాముడు. జన్మతః రాక్షసుడైన విభీషణుణ్ణి ఆదరించిన రాముడు. గాంధీ రాముడు సత్య సాధకుడు. అయితే మహోగ్రదగ్రుడై అస్త్రశస్త్రాలు ధరించి యుద్ధానికి సంసిద్ధుడవుతున్న రాముణ్ణి, పులిని తలపించే ముఖంతో ఉన్న క్రోధుడైన ఆంజనేయుణ్ణి పోస్టర్ల మీద చూసినపుడు వీళ్లిద్దరూ ఇప్పుడు దేశంలో ఎవరి మీద యుద్ధం ప్రకటిస్తున్నారనే ప్రశ్న ఉదయిస్తుంది. బ్రిటిష్ వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కూడా దేశంలో అంతమొందించవలసిన రాక్షసులు ఎవరు మిగిలి ఉన్నారు? అసలు అప్పటి రాక్షసులు ఇప్పుడు ఎవరు? మధ్యలో రాక్షసులైన వాళ్లెవరు? దేవతలకు రాక్షసులకు యుద్ధం ఇంకా జరుగుతూనే ఉందా? రాముడు శంభుక వధను కొనసాగిస్తాడా? వర్తమానం ఎదుట భవిష్యత్తు నిలబడినట్లు మన ముందు ఈ ప్రశ్నలు నిలబడి ఉన్నాయి.

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Advertisement
Advertisement
Advertisement