మహాత్మా జ్యోతిరావుపూలే గొప్ప సంఘ సంస్కర్త

ABN , First Publish Date - 2022-07-05T05:30:00+05:30 IST

మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప విద్యావేత్త, సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు.

మహాత్మా జ్యోతిరావుపూలే గొప్ప సంఘ సంస్కర్త
మెదక్‌లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య, ఎమ్మెల్యే పద్మారెడ్డి

 మెదక్‌లో జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణలో

  రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య


మెదక్‌అర్బన్‌, జూలై5: మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప విద్యావేత్త, సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడని రాజ్యసభ సభ్యుడు,  బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా కేంద్రంలోని బోధన్‌ చౌరస్తాలో  ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని  మంగళవారం లక్ష్మ య్య, ఎమ్మెల్యే పద్మారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కుల వివక్షపై ఆనాడే పోరాటం చేసిన మహానుభావుడు అని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 100 గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరితే 119 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. బీసీ గురుకులాలకు సొంత భవనాల నిర్మాణాల నిధుల కోసం సీఎం కేసీఆర్‌ను కలుస్తానని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 6వేల వసతి గృహాలు నడుస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయ మార్పు కోసం సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని. ఆ దిశగా పోరాటం చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ పూలే సమాజంలో అసమానతలపై రాజీలేని పోరాటం చేశారన్నారు. కుల వ్యవస్థ, స్త్రీవిద్య తదితర సామాజిక అంతరాలపై నిజాయితీగా ఉద్యమించిన గొప్ప విప్లవకారుడు పూలే అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. 195 ఏళ్ల క్రితమే బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి చదువుతోనే అట్టడుగు వర్గాల అసమానతలు తీరుతాయని తెలియ చెప్పిన మహానియుడు పూలే అన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఏఎంసీ చైర్మన్‌ బట్టి జగపతి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మల్లికార్జున్‌గౌడ్‌, శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గంగారాం, బీజేపీ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్‌, కౌన్సిలర్లు, బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T05:30:00+05:30 IST