మహాత్మా.. మన్నించు!

ABN , First Publish Date - 2022-08-12T05:30:00+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

మహాత్మా.. మన్నించు!
షాద్‌నగర్‌ : ఫరూఖ్‌నగర్‌లో రంగు వెలిసిన గాంధీ విగ్రహం

  • స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ గాంధీ విగ్రహాలను మరిచిన నేతలు
  • ఎన్నో ఏళ్లుగా ఆదరణ కరువు
  • పగుళ్లు వచ్చి శిథిలావస్థకు చేరిక
  • కనీసం రంగులకూ నోచని వైనం


ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెట్‌వర్క్‌ : స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సంఘాలు, రాజకీయ పార్టీలు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 75ఏళ్ల స్వాతంత్ర్యాన్ని ఆనందంగా జరుపుకుంటున్నాయి. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాలను ఎగురవేయడం, ర్యాలీలు నిర్వహించడం, జాతీయ జెండాల పంపకం లాంటి కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ సముదాయాల్లో మిరుమిట్లు గొలిపేలా మూడు రంగుల విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, భారత స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన జాతిపిత విగ్రహాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వజ్రోత్సవ వేళ కనీసం వాటికి మరమ్మతులు చేస్తే బాగుండేదన్న వాదన జిల్లావాసుల్లో వినిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వకార్యాలయాలపై విద్యుద్దీపాలను ఏర్పాటు చేసిన అధికారులు గాంధీవిగ్రహాలకు కనీసం రంగులైనా వేస్తే బాగుండేదన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో నిరాదరణకు గురైన గాంధీ విగ్రహాలపై ప్రత్యేక కథనాలు..


కనీసం పూలమాల కూడా కరువు

 షాద్‌నగర్‌, ఆగస్టు 12: జిల్లావ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ జాతీయ జెండాలు పంచుతున్నారు. మొక్కలు నాటడం, ఫ్రీడం రన్‌ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. కానీ దేశానికి స్వాతంత్య్రం రావడానికి పోరాటం చేసిన గాంధీజీని మాత్రం మరించారు. ఫరూఖ్‌నగర్‌లోని గాంధీ విగ్రహానికి ఇప్పటివరకు ఏ ఒక్కరూ కనీసం పూలమాల కూడా వేయలేదు. శిథిలావస్థకు చేరుకుంటున్న ఆ విగ్రహం వైపు కన్నెత్తి చూసేవారు కూడా లేరు. 


విరిగిన చేతికర్ర.. ప్లాస్టిక్‌ పైప్‌ ఏర్పాటు

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఆగస్టు 12 : అవుషాపూర్‌ గ్రామ పంచాయతీ సమీపంలో దాదాపు 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి చేతిలో కర్ర పాడైపోయింది. దీంతో స్థానిక నాయకులు  ఆ కర్ర స్థానంలో ప్లాస్టిక్‌ పైప్‌ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గాంధీ విగ్రహంతో పాటు దిమ్మకు సైతం రంగు వెలిసిపోయి ఉంది. గాంధీ విగ్రహానికి, దిమ్మెకు ఒకవైపు పెచ్చులు ఊడిపోతున్నాయి.


పెచ్చులూడుతున్న విగ్రహం

తాండూరు రూరల్‌, ఆగస్టు 12 : తాండూరు మండలం చెంగోల్‌ గ్రామంలో 1986లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఏర్పాటు చేశారు. తర్వాత దాని గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరింది. విగ్రహం నుంచి పెచ్చు లూడుతున్నాయి. కనీసం వజ్రోత్సవాల సందర్భంగా అయినా విగ్రహాన్ని బాగుచేసి రంగులు వేస్తారని స్థానికులు ఆశించినా ఎవరూ దానివైపు చూసిన పాపానపోలేదు.


రంగు వెలిసి.. పెచ్చులూడుతూ..

ఘట్‌కేసర్‌, ఆగస్టు 12 : ఘట్‌కేసర్‌ గ్రంధాలయం ఎదుట 2012లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారి్‌సతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆ విగ్రహానికి రంగులు వేయించలేదు. దీంతో అది వెలిసిపోయింది. పైగా విగ్రహం పెచ్చులూడుతున్నాయి. గాంధీ జయంతి, వర్ధంతికి విగ్రహానికి పూలమాలలు వేస్తున్న అధికారులు విగ్రహం గురించి పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. కనీసం స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అయినా విగ్రహానికి మరమ్మతులు చేసి రంగులు వేస్తారని భావించినా తమకు నిరాశే ఎదురైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


తీగలే ఆధారం..

పెద్దేముల్‌, ఆగస్టు 12 : పెద్దేముల్‌ మండలంలో జాతిపిత గాంధీజీ విగ్రహం పూర్తిగా శిథిలమైంది. విగ్రహం నిలబడలేని పరిస్థితి ఉంది. దీంతో గ్రామస్థులు జీఏవైరు రాతి స్థంభానికి కట్టి విగ్రహం నిలబడి ఉండేలా చేశారు. ఒకవేళ ఆ తీగ తెగితే విగ్రహం కిందపడి పోయేలా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న విగ్రహాన్ని కనీసం పట్టించుకునే వారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


చేయి విరిగినా పట్టించుకోలే..

కొడంగల్‌ రూరల్‌, ఆగస్టు 12 : కొడంగల్‌ మండలం అప్పాయిపల్లిలో ఏర్పాటు చేసిన జాతిపిత విగ్రహం శిథిలావస్థకు చేరింది. కొన్ని సంవత్సరాలుగా దీనిని పట్టించుకునే వారే కరువయ్యారు. కనీసం స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ కూడా ఈ విగ్రహానికి మరమ్మ తులు చేపట్టలేదు. ప్రస్తుతం గాంధీజీ విగ్రహం చేయి, కర్ర విరిగిపోయి ఉన్నాయి.




Updated Date - 2022-08-12T05:30:00+05:30 IST