శంభో.. శివశంభో

ABN , First Publish Date - 2020-02-22T08:18:25+05:30 IST

శంభో.. శివశంభో, సాంబ సదాశివ, శివ శివ శంకర స్మరణలతో శివాలయాలు గణగణ మోగాయి. ముక్కంటిని కళ్లనిండుగా కని, జగాలను కాసే ఆ జంగముడికి భక్తకోటి ప్రణమిల్లింది. తోయాభిషేకం చేసి, మూడాకుల మారేడుతో...

శంభో.. శివశంభో

శివ నామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు.. 

రాష్ట్రంలో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): శంభో.. శివశంభో, సాంబ సదాశివ, శివ శివ శంకర స్మరణలతో శివాలయాలు గణగణ మోగాయి. ముక్కంటిని కళ్లనిండుగా కని, జగాలను కాసే ఆ జంగముడికి భక్తకోటి ప్రణమిల్లింది. తోయాభిషేకం చేసి, మూడాకుల మారేడుతో ఆ రేడును కొలిచి తరించింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం నుంచే శివాలయాలు కిటకిటలాడాయి. విశేష సంఖ్యలో ఆలయాలకు భక్తులు విచ్చేసి పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. వరంగల్‌లోని వేయిస్తంభాల గుడిలోని రుద్రేశ్వరుడికి భక్తులు అభిషేకాలు చేశారు. రాత్రి 7 గంటలకు రుద్రేశ్వర కల్యాణం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ మండలం కాళేశ్వరంలో ముక్తీశ్వర స్వామిని భక్తులు దర్శించుకున్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరాలయంలో స్వామివారికి భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. రాత్రి 11:35 లింగోద్భవ సమయాన మహాన్యాన పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్‌ జిల్లా ఏడుపాయలలోని వనదుర్గ ఆలయాన్ని మంత్రి హరీశ్‌ దర్శించుకొని ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. గద్వాల జిల్లా ఆలంపూర్‌ శ్రీ జోగులాంబ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పలువురు మంత్రులు, ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఏపీలో శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, బెజవాడ కనకదుర్గ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి మొక్కులు సమర్పించుకున్నారు. మహాశివరాత్రిని పురష్కరించుకుని శుక్రవారం కీసరగుట్టలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన కేసరగిరి శ్రీరామలింగేశ్వరస్వామిని గవర్నర్‌ తమళిసై దంపతులు దర్శించుకున్నారు.  స్వామివారికి అభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ మనుమడు హిమాన్షు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.  

Updated Date - 2020-02-22T08:18:25+05:30 IST