మహర్దశ

ABN , First Publish Date - 2022-08-13T06:25:50+05:30 IST

మహర్దశ

మహర్దశ

త్వరలో మినీ అంగన్‌వాడీ కేంద్రాల ఉన్నతీకరణ

మారనున్న కేంద్రాల రూపురేఖలు

ఆయాల నియామకం.. టీచర్లకు పెరగనున్న వేతనాలు

పిల్లలు, గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు

ఉమ్మడి జిల్లాలో 530 మినీ కేంద్రాలకు చేకూరనున్న లబ్ధి


గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాలతో సమానంగా నడుస్తున్న మినీ అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని 530 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించనున్నది. ప్రస్తుతం ఒకే ఉపాధ్యాయురాలితో పనిచేస్తున్న ఈ కేంద్రాల్లో ఆయాలను కూడా నియమించనున్నారు. దీనితో దశాబ్దాలుగా సమస్యల వలయంలో కొట్టుమిట్లాడుతున్న మినీ అంగన్‌వాడీ కేంద్రాల దశ తిరగనున్నది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టారు. 


హనుమకొండ, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి) : పెరుగుతున్న చిన్నారుల సంఖ్యకు అనుగుణంగా సేవలు అందించేందుకు మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న జనాభా, చిన్నారుల సంఖ్య, ఈ కేంద్రాల ప్రస్తుత తీరుతెన్నుల వివరాలను కేంద్రం తెప్పించుకున్నది.  ప్రస్తుతం ఉన్న ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలతో సమానంగా వీటిని అభివృద్ధి చేయనున్నారు. దీంతో త్వరలో ఈ కేంద్రాల రూపురేఖలు మారనున్నాయి. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఉన్నతీకరించేందుకు ఆయా కేంద్రాల పరిధిలో జనాభా, పిల్లలు, గర్భిణులు, బాలింతల సంఖ్యతో పాటు 13 అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన సమగ్ర నివేదికలను స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు రాష్ట్రప్రభుత్వానికి సమర్పించారు. 


ఒక్కరిపైనే భారం

అంగన్‌వాడీ కేంద్రాలకు తోడు రెవెన్యూ గ్రామాలకు దూరంగా అవాసాలున్న తండాల్లో, జనాభా తక్కువగా ఉన్న గ్రామాల్లో మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా  కేంద్రాల్లో ఒక్కో టీచర్‌ను నియమించి వారి ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలు అందిస్తున్నారు. గతంలో జనాభా, పిల్లల సంఖ్య తక్కువ ఉండటంతో ఈ కేంద్రాలకు ఆయాలను ప్రభుత్వం నియమించలేదు. దీంతో టీచరే అన్ని పనులు చూసుకోవల్సి ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ఒక పూట సంపూర్ణ భోజనం వండి పెట్టడం, రికార్డుల నిర్వహణ, పిల్లలకు పౌష్టికాహారంతో పాటు వారికి పూర్వవిద్య అందించడం వంటి పనులు నిర్వహించాల్సి వస్తున్నది. పెరిగిన జనాభా, చిన్నారుల సంఖ్య, బాలింతలకు గర్భిణులకు సేవలు అందించడం భారంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మినీ అంగన్‌వాడీ కేంద్రాల స్థాయిని ప్రధాన అంగన్‌వాడీకేంద్రాల స్థాయికి పెంచాలని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మినీ అంగన్‌వాడీ కేంద్రాలలోని ఉపాధ్యాయులు.. అధికారులు, నాయకులను కలిసి పలుమార్లు వినతి పత్రాలను సమర్పించారు. వారి విజ్ఞప్తులను వాస్తవాలను పరిశీలించిన తర్వాత తాజాగా నిబంధనలతో కూడిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 


400 జనాభాపైన..

ఈ మార్గదర్శకాల ప్రకారం మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 400 జనాభాకు పైగా ఉన్నవాటిని ప్రధానకేంద్రాలుగా మార్చనున్నారు. గిరిజన ప్రాంతాల్లో అయితే 300పైన జనాభా కలిగి ఉన్నప్పటికీ ప్రధాన కేంద్రాలుగా మార్చుతారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలస్థాయి పెరగడం వల్ల ఆయాల నియామకం జరుగుతుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి. అయితే డేటా నమోదులో తప్పులు దొర్లడంతో చాలా మినీ అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో జనాభా, లబ్ధిదారుల సంఖ్య సున్నాగా కనిపిస్తోంది. దీంతో మరోసారి క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరించి సీడీపీవోలు నివేదికలను జిల్లా కార్యాలయాలకు పంపారు. వాటి ఆధారంగా వివరాలను ఆన్‌లైన్‌లో ఇటీవలే నమోదు చేశారు. 


వేతనం సంగతి?

ఉన్నతీకరించడం సరే.. మరి తమ వేతనం సంగతేమిటని మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాన అంగన్‌వాడీ టీచర్‌తో సమానంగా.. అంతకంటే ఎక్కువగా పనిచేస్తున్న మినీ అంగన్‌వాడీ టీచర్‌కు ప్రభుత్వం ఇచ్చే వేతనం తక్కువగా ఉంది. ప్రధాన అంగన్‌వాడీ ఉపాధ్యాయురాలికి వేతనం రూ.13,650 కాగా, మినీ అంగన్‌వాడీ టీచర్‌ వేతనం రూ.7,800 మాత్రమే చెల్లిస్తున్నారు. హెల్పర్‌కు ఇచ్చే వేతనం తమకు ఇస్తూ అన్ని పనులు చేయిస్తున్నారని మినీ కేంద్రం టీచర్లు అంటున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ఉన్నతీకరణ చేపడుతున్న ప్రస్తుత తరుణంలో వేతన విషయంలోనూ స్పష్టత ఇవ్వాలని మినీ అంగన్‌వాడీ ఉపాధ్యాయులు కోరుతున్నారు. అయితే మినీ అంగన్‌వాడీ కేంద్రాలు అప్‌గ్రేడ్‌ అయిన అనంతరం టీచర్ల వేతనాన్ని రూ. 13,650 పెరగనున్నట్టు తెలుస్తోంది.


530 మినీ కేంద్రాలు

రాష్ట్రంలో 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 530 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో హనుమకొండ జిల్లాలో 31, వరంగల్‌ జిల్లాలో 46, జనగామ జిల్లాలో 150, మహబూబాబాద్‌ జిల్లాలో 151, ములుగు జిల్లాలో 97, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 55 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు  ఉన్నాయి. 

Updated Date - 2022-08-13T06:25:50+05:30 IST