గుంతల దారికి మహర్దశ

ABN , First Publish Date - 2022-05-01T05:24:47+05:30 IST

దుద్దెడ టు జనగామ రహదారికి మహర్దశ పట్టింది. చేర్యాల ప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. ఈ రోడ్డుపై ప్రయాణం చేసి నరకయాతన అనుభవించిన వాహనదారులకు తీపికబురు వచ్చింది. త్వరలోనే జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేలా శుక్రవారం రోజున కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయితే సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకూ జాతీయ రహదారి హోదా కల్పించినప్పటికీ విస్తరణ పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్నాయి.

గుంతల దారికి మహర్దశ

దుద్దెడ - జనగామ రోడ్డుకు గ్రీన్‌సిగ్నల్‌

పనుల నిర్వహణకు శంకుస్థాపన 

రూ.423 కోట్లతో 46 కి.మీ.ల మేర విస్తరణ

సిద్దిపేట-ఎల్కతుర్తి హైవేకు మోక్షమేది?

దుద్దెడ నుంచి జనగామ వెళ్లే రహదారి


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, ఏప్రిల్‌ 30 : దుద్దెడ టు జనగామ రహదారికి మహర్దశ పట్టింది. చేర్యాల ప్రాంత వాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. ఈ రోడ్డుపై ప్రయాణం చేసి నరకయాతన అనుభవించిన వాహనదారులకు తీపికబురు వచ్చింది. త్వరలోనే జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టేలా శుక్రవారం రోజున కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయితే సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకూ జాతీయ రహదారి హోదా కల్పించినప్పటికీ విస్తరణ పనులు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉన్నాయి. 


అధ్వాన రహదారి ఇక రాచమార్గంలా

రాజీవ్‌ రహదారిపై ఉన్న దుద్దెడ నుంచి జనగామ జిల్లా కేంద్రానికి ప్రస్తుతం డబుల్‌ రోడ్డు ఉన్నా గుంతలమయమై అధ్వానంగా తయారైంది. చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూళిమిట్ట మండలాల ప్రజలు సిద్దిపేట జిల్లా కేంద్రానికి ఇదే దారి గుండా వస్తారు. ఈ రోడ్డును పట్టించుకోకపోవడంతో గుంతలు తయారయ్యాయి. ఈదారిలో  అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎప్పటినుంచో మరమ్మతులు చేయాలని వాహనదారులు మొరపెట్టుకున్నా అప్పుడప్పుడు ప్యాచ్‌వర్క్‌లతోనే సరిపెట్టారు. కానీ శాశ్వత పరిష్కారం చూపలేదు. ఈ జిల్లాలో చేర్యాల మండలం వీరన్నపేట వరకు ఇది విస్తరించి ఉంది. ఆ తర్వాత జనగామన జిల్లా ప్రారంభమవుతుంది. తాజాగా శుక్రవారం రోజున కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.423 కోట్ల నిధులను కేటాయించారు. దుద్దెడ నుంచి జనగామ వరకు పేవ్డ్‌ షోల్డర్స్‌తో రెండు వరుసల రహదారిని విస్తరించనున్నారు. ఒక్కో కిలోమీటరుకు రూ.10 కోట్ల పైచిలుకు వెచ్చించి 46కి.మీ.ల దూరం విస్తరించేలా ప్రణాళిక సిద్దం చేశారు. గుంతలు, మూలమలుపులతో కూడిన జనగామ ప్రయాణం రాబోవు రోజుల్లో రాచమార్గంలా మారనున్నది. 


సిద్దిపేట-ఎల్కతుర్తి హైవే జాప్యం

సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారికి జాతీయ హోదా కల్పించారు. నిధులు కూడా కేటాయించినట్లు ఉత్తర్వులు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా పనులు ప్రారంభం కాలేదు. పలుమార్లు సర్వేలు చేశారు. నాలుగు వరుసల రహదారి నిర్మించడానికి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉంది. భూసేకరణకు పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదు. కానీ పనులపై సందిగ్దత నెలకొన్నది. దుద్దెడ టు జనగామ రహదారి పనులకు శంకుస్థాపన జరగడంతో అందరి దృష్టి సిద్దిపేట- ఎల్కతుర్తి హైవే వైపు మళ్లింది. దాదాపు 65కి.మీ.ల ఈ రహదారి నిర్మాణం జరిగితే వరంగల్‌, హనుమకొండ జిల్లా కేంద్రాలకు ప్రయాణం సులభతరంగా మారుతుంది. హైవే పనులు ప్రారంభిస్తారనే యోచనతో ప్రస్తుతం ఈ రహదారిపై మరమ్మతులు కూడా చేయడం లేదు. ప్రతీ వర్షాకాలంలో బస్వాపూర్‌, పందిల్ల వద్ద రోడ్డుపై వాగులు పొంగి వాహనాల ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. 

Updated Date - 2022-05-01T05:24:47+05:30 IST