పాఠశాలల కు మహర్దశ

ABN , First Publish Date - 2022-05-07T06:19:20+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల కు మహర్దశ పట్టనుంది. రూ. 48.36 కోట్ల వ్యయంతో జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాలలో ఉన్న 237 పాఠశాలలకు మరమ్మతులతో పాటు పాఠశాలల భవనాలను మరింత

పాఠశాలల కు మహర్దశ
ఉట్నూర్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల

‘మన ఊరు, మన బడి’తో  ప్రభుత్వ పాఠశాలలకు నూతన హంగులు

జిల్లాలోని మొత్తం 237 పాఠశాలల భవనాలకు మెరుగులు

కంప్యూటర్‌ గదులు, భోజన శాలలు, ప్రహరీల నిర్మాణంతో పాటు పలు పనులు

కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పనకు ప్రణాళికలు

రూ. 48.36 కోట్లతో ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాలలో మరమ్మతులు

ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు!!

వేసవి సెలవుల్లోనే పూర్తిస్థాయి పనులు

కలెక్టర్‌ ఆదేశాలతోనే సంబంధిత శాఖ అధికారుల కసరత్తు

ఉట్నూర్‌, మే 6: తెలంగాణ ప్రభుత్వం  ప్రవేశ పెడుతున్న ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల కు మహర్దశ పట్టనుంది. రూ. 48.36 కోట్ల వ్యయంతో జిల్లాలోని ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాలలో ఉన్న 237 పాఠశాలలకు మరమ్మతులతో పాటు పాఠశాలల భవనాలను మరింత మెరుగు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని పంచాయతీరాజ్‌ అధికారుల ద్వారా పాఠశాలలకు కావాల్సిన సౌకర్యాల గురించి  తెలుసుకుంది. ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు సూచించిన విధంగా ఇంజినీరింగ్‌ అధికారులు అంచనాలను తయారు చేయడంతో ప్రభుత్వం జిల్లాకు 48.36 కోట్లు మంజూరు చేయాలని బావించింది. ఇప్పటికే సుమారు రూ.30 కోట్లు మంజూరు అయినట్లు  తె లుస్తుంది. ఉట్నూర్‌ మండలంలో 66 ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. మొదటి దశలో 23 పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా అధికారులు ఎంపిక చేశారు. రాష్ట్రంలో రూ.3400 కోట్లతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. ఇందులో భాగంగానే జిల్లాలో 237 పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఉట్నూర్‌ మండల కేంద్రంలో ఏడు దశాబ్దాల క్రితం నిర్మించిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల రూపురే ఖలు మారనున్నాయి. సుమారు రూ.కోటి వెచ్చించి పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయిలో సౌకర్యాలు కల్పించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. మండలంలోని 22 పాఠశాలలకు.. అందులో ఒక్కో పాఠశాలకు రూ.ఐదు లక్షల  నుంచి రూ.15 లక్షల వరకు మంజూరు కానున్నాయి. జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరగించడానికి కావాల్సిన భోజన శాలను అన్ని హంగులతో ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్‌ గదులు సైతం అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. 

వంట గదులు, ప్రహరీల నిర్మాణం

ప్రభుత్వ పాఠశాలలను ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పాఠశాలల్లో వంట గదులు, మరుగుదొడ్లు, ప్రహరీలు నిర్మించాలని నిర్ణయించింది. పాఠశాల విద్యా కమిటీల ద్వారా హెచ్‌ఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘మన ఊరు-మన బడి’ పాఠశాలల ఉన్నతీకరణకు కృషి చేస్తున్నట్లుగానే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించడానికి ఉపాధి హామీ ద్వారా వంటగదులు నిర్మించాలని భావిస్తోంది. ఈ నెల 10వ తేదీ వరకు అంచనాలను అధికారులు పూర్తి చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు కలెక్టర్‌ ద్వారా సమర్పించనున్నారు. మరి కొన్ని రోజుల్లోనే కలెక్టర్‌ ఆదేశాలతో వేసవి సెలవులకంటే ముందే పాఠశాలల్లో పూర్తిస్థాయి పనులు చేపట్టాలని జిల్లా అధికారులు  భావిస్తున్నారు. కాగా, ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా మొదటి దశ కింద 237 పాఠశాలలను  అభివృద్ధి చేయడానికి గుర్తించారు.

‘మన ఊరు-మన బడి’లో ఎంపికైన పాఠశాలలివే..       

 నియోజక వర్గం              మండలాలు         పాఠశాలల సంఖ్య      

 ఆదిలాబాద్‌          ఆదిలాబాద్‌, బేల, 

                                 జైనథ్‌, మావల          78

          బోథ్‌         బోథ్‌, బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌

                     నేరడిగోండ, తలమడుగు, తాంసి, భీంపూర్‌     99

     ఖానాపూర్‌         ఉట్నూర్‌, ఇంద్రవెళ్లి, సిరికొండ               41

     ఆసిఫాబాద్‌             నార్నూర్‌, గాదిగూడ                        19

త్వరలోనే ఎంపికైన పాఠశాలల్లో పనులు ప్రారంభం 

: శివగణేష్‌, డీఈఈ, ఉట్నూర్‌

ఉట్నూర్‌ డివిజన్‌లోని ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాల్లోని ఎంపికైన పాఠశాలల్లో త్వరలోనే పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరమ్మతులతో పాటు నూతన హంగులు తీర్చిదిద్దుతాం. దీనిలో భాగంగా పాఠశాలల ప్రారంభానికంటే ముందే ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాలను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.  

Read more