రేణిగుంట రైల్వేస్టేషన్‌కు మహర్దశ

ABN , First Publish Date - 2021-06-13T06:39:52+05:30 IST

రేణిగుంట రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. రానున్న ఐదేళ్లలో రూ.140కోట్లతో స్టేషన్‌ ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు.

రేణిగుంట రైల్వేస్టేషన్‌కు మహర్దశ
నమూనా చిత్రం

రూ.140 కోట్లతో ఆధునికీకరణ


తిరుపతి(ఆటోనగర్‌), జూన్‌ 12: రేణిగుంట రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టనుంది. రానున్న ఐదేళ్లలో రూ.140కోట్లతో స్టేషన్‌ ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. దీనిపై ఇప్పటికే ఆర్‌ఎల్‌డీఏ (రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) అధికారులు సర్వే చేశారు. దక్షిణ మధ్య రైల్వేకు గేట్‌వేగా రేణిగుంట రైల్వేస్టేషన్‌ గుర్తింపు ఉంది. 40 ఏళ్ల నుంచి దశల వారీగా  అభివృద్ధి చెంది.. ఏ గ్రేడ్‌ స్టేషన్‌గా మారింది. ఆ తర్వాత రైల్వే అధికారులు దేశంలో ఖాళీగా ఉన్న రైల్వేస్టేషన్లలోని స్థలాలను అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా.. ఇటీవల ఆర్‌ఎల్‌డీఏ అధికారులు రేణిగుంట రైల్వేస్టేషన్‌ తూర్పుగా ఉన్న ఉద్యోగుల నివాస గృహాలు, చిన్నపాటి కార్యాలయాలు, కళ్యాణ మండపం, ఖాళీ స్థలాలు, ఆస్పత్రి తదితర భవనాలున్న స్థలాలను పరిశీలించారు. వీటిని తొలగించి.. ఈ స్థానంలో ఆధునిక పద్ధతిలో భవనాలను నిర్మిస్తే కలిగే ఆదాయ మార్గాలు, నూతన విఽధానాలపై కసరత్తు చేపట్టారు. ఇందులో.. బడ్జెట్‌ హోటళ్లు, షాపింగ్‌ కాంప్లెక్సు, కమర్షియల్‌ భవనాలు, బస్టాండు, మల్టీ లెవల్‌ కారు పార్కింగ్‌ వంటివి కార్పొరేట్‌కు దీటుగా నిర్మించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలను తయారు చేశారు. శనివారం రైల్వేస్టేషన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యాకు ఈ ప్రణాళికలను ఆర్‌ఎల్‌డీఏ అధికారులు జీవీవీఎస్‌ రాజు, ఎస్‌.షకీల్‌ అహ్మద్‌ వివరించారు. నివేదికను చూశాక నిర్మాణాలు చేపట్టనున్న స్థలాన్ని కూడా అధికారులతో కలిసి జీఎం పరిశీలించారు. ఓ పక్క విమానాశ్రయం మరో పక్క తిరుపతి స్మార్ట్‌ సిటీకి మధ్యలో ఉండటంతో ఈ స్టేషన్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టామని జీఎం పేర్కొన్నారు.  

Updated Date - 2021-06-13T06:39:52+05:30 IST