మన ఊరు-మన బడితో సర్కారు బడులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-05-20T05:02:08+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి

మన ఊరు-మన బడితో సర్కారు బడులకు మహర్దశ
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

  • సమీక్షా సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, మే 19 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని కోర్టు హాల్లో మన ఊరు - మన బడి కార్యక్రమంపై ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీ్‌పకుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ దేవసేన, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన ఊరు - మన బడి  కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి సకల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌, అధికారులకు సూచించారు. 

రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 9,300 పాఠశాలలను ఆధునికీకరించి సదుపాయాలు కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1309 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, తొలి విడతలో గ్రామీణ ప్రాంతంలో 304 పాఠశాలలు, అర్బన్‌లో 160 పాఠశాలలు, విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని 464 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. 


విరాళాలు అందించి సహకరించాలి

ఆర్థికంగా ఉన్నతస్థానాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న ప్రభుత్వ బడులకు విరివిగా విరాళాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్లు, సర్పంచ్‌లు, ప్రధానోపాధ్యాయులు పూర్వ విద్యార్థులను, ఇతర దాతలను సంప్రదించి ప్రభుత్వ బడులకు విరాళాలు సమకూర్చుకోవాలని సూచించారు. 


ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం

ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై జూన్‌ 1 నుంచి బడిబాట, జూన్‌ 3 నుంచి పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో అధిక సంఖ్యలో చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేసేందుకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.


పరిపాలన అనుమతులిచ్చాం : జిల్లా కలెక్టర్‌ 

జిల్లాలో మొదటి విడతలో గుర్తించిన 464 పాఠశాలలకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఇచ్చిన సూచనలు పాటించి పాఠశాల పునఃప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, సురభివాణీదేవి, ఎగ్గే మల్లేశం, జనార్ధన్‌రెడ్డి, శాసనసభ్యులు సుధీర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్‌, అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు, జడ్పీ సీఈవో దిలీ్‌పకుమార్‌, డీఆర్‌డీఏ పీడీ ప్రభాకర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 


వచ్చే విద్యాసంవత్సరం నుంచి టీచర్‌, పేరెంట్స్‌ మీటింగ్‌ : మంత్రి

రానున్న విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో టీచర్‌, పేరెంట్స్‌ మీటింగ్‌ నిర్వహిం చనున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. ఇంగ్లీష్‌, తెలుగు మీడియం పుస్తకాల ముద్రణ జరుగుతుందన్నారు. ఈనెల 23 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు.  ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. గ్రామాల పరిధిలో పాఠశాలలను క్లీన్‌ చేసుకోవాలని, మున్సిపాలిటీల పరిధిలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని కేటాయించాలని ఆమె ఆదేశించారు. 



Updated Date - 2022-05-20T05:02:08+05:30 IST